PUBLISHED:
SUN,JULY 17, 2016 02:18 AM
-తెలంగాణ తెలుగుకు వెయ్యేండ్లకు పైగా
ప్రాచీనత
-నన్నయకు వందేండ్లకు ముందే పద్యరచన
-నాలుగు తెలుగు కావ్యాలు రాసిన పంప మహాకవి
-కన్నడ సాహిత్యంలో ఆదికవిగా చిరకీర్తి
-బోధన్, ధర్మపురి, కురిక్యాల శాసనాల్లో వివరాలు
-తెలుగు ప్రాచీనత గుర్తింపునకు మార్గం సుగమం
-క్రీ.శ. 931నాటి విక్రమార్జున విజయంలో ప్రస్తావన
-ఆంధ్ర చేతులెత్తేస్తే ఆధారాలిచ్చి ఆదుకున్న తెలంగాణ
-నన్నయకు వందేండ్లకు ముందే పద్యరచన
-నాలుగు తెలుగు కావ్యాలు రాసిన పంప మహాకవి
-కన్నడ సాహిత్యంలో ఆదికవిగా చిరకీర్తి
-బోధన్, ధర్మపురి, కురిక్యాల శాసనాల్లో వివరాలు
-తెలుగు ప్రాచీనత గుర్తింపునకు మార్గం సుగమం
-క్రీ.శ. 931నాటి విక్రమార్జున విజయంలో ప్రస్తావన
-ఆంధ్ర చేతులెత్తేస్తే ఆధారాలిచ్చి ఆదుకున్న తెలంగాణ
వెయ్యేండ్లకు పూర్వమే ఈ నేల మీద తెలుగు సాహిత్యం పరిఢవిల్లింది. పుంఖానుపుంఖాలుగా కావ్యరచన సాగింది. ఆంధ్రులు చెప్పుకునే ఆదికవి నన్నయకు వందేండ్లకు ముందే ఈ గడ్డ మీద పంప మహాకవి తెలుగు కావ్యాలు రాశారు. త్రిభాషా ప్రవీణుడైన ఆ మహాకవిని కన్నడ సాహిత్యం కన్నడ ఆదికవిగా గుర్తింపునిస్తే ఆంధ్ర ఆధిపత్య వర్గాలు ఆదికవిగా కాదు.. కనీసం తెలుగుకవిగా కూడా గుర్తించలేదు. సత్యం చరిత్ర గర్భం చీల్చుకుని బయటికి వస్తుంది. ఇవాళ తెలుగు ప్రాచీనత నిరూపణకు ఇదే పంపన సాహిత్యం ఆధారంగా మారుతున్నది. మద్రాసు హైకోర్టులో తెలుగు ప్రాచీనత కేసులో ఏపీ చేతులెత్తేస్తే తెలంగాణ పంపన రచనలు, అనేక శాసనాలు సమర్పించింది. ఒకనాడు తెలంగాణ సాహిత్యాన్ని గుర్తించ నిరాకరించిన ఆధిపత్య తెలుగుకు ఇపుడు పంపన సాహితీ జిలుగులే ఆధారం కావడం సత్యమేవ జయతే అన్న నానుడిని గుర్తుకు తెస్తున్నది.
నాగవర్ధన్ :రాయల తెలంగాణ ప్రాంతంలో తెలుగు సాహిత్యానికి వెయ్యేండ్ల ప్రాచీనత ఉంది. ఆంధ్రులు ఆదికవిగా చెప్పుకున్న నన్నయ్యకు వందేండ్ల ముందే ఇక్కడ మహాకవి పంపన నాలుగు తెలుగు కావ్యాలు రాసినట్టు ఆధారాలు ఉన్నాయి. దేశీ కవిత్వానికి, కంద పద్యానికి ప్రాచీన మూలాలు తెలంగాణలోనే లభ్యమయ్యాయి. కన్నడ సాహిత్యంలో ఆదికవిగా ప్రాచుర్యం పొందిన వేములవాడ చాళుక్య రాజుల ఆస్థాన కవి పంపన తెలుగులోనూ నాలుగు కావ్యాలు రాసినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. తెలుగులో ఆదికవిగా ప్రచారం చేసిన నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు కాగా, పంపన క్రీ.శ. 902 నుంచి 975 మధ్యకాలంలో జీవించారు.
తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో కావ్య రచన చేసిన పంపమహాకవి తెలుగువాడు. ఆయన పూర్వీకులు కమ్మనాడు(గుంటూరు)లోని వేంగిపర్రు ప్రాంతం నుంచి సబ్బినాడు(కరీంనగర్) ప్రాంతానికి వలస వచ్చారు. ఈ ప్రాంతంలోనే స్థిరపడ్డ పంపన వృద్ధాప్యంలో బోధన్‌లో జీవసమాధి పొందారు. కన్నడ సాహితీకారులు ఆయనను కన్నడ ఆదికవిగా అక్కున చేర్చుకోగా తెలుగువారు మాత్రం విస్మరించారు. తెలంగాణ స్వరాష్ర్టాన్ని పునర్నిర్మించుకుంటున్న తరుణంలో పంపమహాకవి మూలాలపై పరిశోధనలు ముమ్మరం చేసింది.
క్రీ.శ. 931 నాటికే
తెలుగులో కావ్యాలు..
వేములవాడ చాళుక్య రాజులలో ప్రసిద్ధుడు రెండవ అరికేసరి. ఆయన సాహిత్య ప్రియుడు. ఆయన ఆస్థానంలోని కవులలో పంపన ఒకడు. కన్నడ భాషలో విక్రమార్జున విజయం, ఆదిపురాణం అనే కావ్యాలను రచించారు. ఇందులో ఆదిపురాణం జైన తీర్థంకరుల కథ కాగా, విక్రమార్జున విజయం మహాభారత కథకు స్వేచ్ఛానుసృజన. పదహారు వందల ఏడు పద్యాలతో సాగిన ఈ కావ్యానికి విక్రమార్జున విజయం అని పంపన నామకరణం చేసినా, అది జనబాహుళ్యంలో పంప భారతంగా ప్రసిద్ధికెక్కింది. వ్యాస మహాభారతంలో శ్రీకృష్ణ పాత్రకు ప్రాధాన్యం ఉంటే, పంప భారతంలో అర్జునుడే కథానాయకుడు.
ఆ రకంగా వ్యాస భారతాన్ని కేవలం కన్నడీకరించడం కాకుండా స్వీయ భారత పురాణ పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ప్రాచీన కవులు, గ్రంథకర్తలు ఏ రచననైనా ముందు దేవతా ప్రార్థన, ఆ తర్వాత తమ వంశ,గోత్ర నామ విశేషాలు వెల్లడిస్తూ రచన కొనసాగించడం ఒక సంప్రదాయం. 19వ శతాబ్ద ప్రారంభదశ వరకూ ఈ ఆనవాయితీ కొనసాగింది. క్రీ.శ. 931లో రాసిన విక్రమార్జున విజయం, ఆదిపురాణంలో పంపన తన వంశ, గోత్రనామ విశేషాలతో పాటు తన గత రచనలను కూడా ప్రస్తావించారు. కన్నడ కావ్యాలతోపాటు తన మాతృభాష అయిన తెలుగులో నాలుగు గ్రంథాలను రాసినట్లుగా పేర్కొన్నారు. దీని ఆధారంగా ఆ కాలం నాటికే తెలుగు సాహిత్యం ఉందని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ గుర్తించింది.
ప్రాచీన కావ్యం.. జినేంద్ర పురాణం
పంపనకు, నన్నయ్యకు వందేండ్లకుపైగా వ్యత్యాసం ఉంది. కానీ ఆంధ్రుల పాలనలో తెలుగు సాహిత్య చరిత్రకు నన్నయే ఆదికవిగా నిలిచిపోయాడు. కురిక్యాల, బోధన్, ధర్మపురి ప్రాంతాల్లో లభించిన శిలాశాసనాలపై ఉన్న పద్యాలు పంపన సాహిత్యాన్ని పరిచయం చేస్తూనే ఉన్నా.. ఆ కావ్యాల అధ్యయనం, పరిశోధనపై జరుగాల్సిన కృషి జరుగలేదు. ఇంతదాక తెలుగు సాహిత్య చరిత్రపై జరిగిన పరిశోధనలన్నీ 950 సంవత్సరాలు (నన్నయ కాలం) దాటి వెనక్కిపోలేదు. తెలుగు సాహిత్యంలోని పద్మకవి, పద్మప్ప పేర్లతో ఉన్న కవి కూడా పంపనయేనని పలువురు సాహిత్య పరిశోధకులు అభిప్రాయపడ్డారు. పంపనకు పంప, పంపడు పేర్లుకూడా ఉన్నాయి. పంపనయే పద్మకవి అని నిడదవోలు వెంకటరావు పేర్కొన్నారు. క్రీ.శ. 941లో పద్మకవి (పంపన) రచించిన జినేంద్ర పురాణంగురించి వేటూరి ప్రభాకర శాస్త్రి తన ప్రబంధ రత్నావళిలో ప్రస్తావించారు. అందులోని ఓ సీస పద్యం ఇలా ఉంది..
హరినిలయంబును హరినిలయంబును - విషధరాఢ్యంబును
విషధరాడ్య
మప్సరోమయమును నప్సిరోమయమును - వన విలాసమును పావన విలాస
మున్నత కరిశృంగ మున్నతి కరిశృంగ - మిందు కాంత స్రవమిందు కాంత
మురుకలనకులంబు నురుకలనకులంబు - నంశుకాంత ద్యోతి నాంశుకాంత
మొనర నవశత సాహస్రయోజ నోన్న
మప్సరోమయమును నప్సిరోమయమును - వన విలాసమును పావన విలాస
మున్నత కరిశృంగ మున్నతి కరిశృంగ - మిందు కాంత స్రవమిందు కాంత
మురుకలనకులంబు నురుకలనకులంబు - నంశుకాంత ద్యోతి నాంశుకాంత
మొనర నవశత సాహస్రయోజ నోన్న
తమును పదివేల యోజనా/లమరు/వలము
గలిగి కనాకాద్రికిన్నూటగలిగితనరి
ప్రధితమై యెప్పు మందర పర్వతంబు
పంపన పూర్వీకులు తెలుగువాళ్లే..!
కన్నడ సాహితీ సృజన వల్ల పంపన తెలుగువాడా కాడా అనే సందేహాలు ఉన్నా వాటిని పటాపంచలు చేస్తూ పంపనకు సంబంధించిన జీవిత విశేషాలను తెలియజేసే శాసనం కురిక్యాల (కరీంనగర్ జిల్లా)లో లభించింది. ఇది 10వ శతాబ్దానికి సంబంధించిది. దీన్ని పంపన తమ్ముడు జినవల్లభుడు వేయించాడు. ఈ శాసనం ద్వారానే కంద పద్యం వెలుగులోకి వచ్చింది. తమ కుటుంబం వేంగిపర్రు నుంచి వలస వచ్చినట్లుగా ఈ శాసనంలో పేర్కొన్నాడు. తన తండ్రి భీమప్పయ్య, తాత అభిమాన చంద్ర అని తాము బ్రాహ్మణ కులానికి చెందిన వారమని, వైష్ణవ మతాన్ని వీడి జైన మతాన్ని స్వీకరించామని ఆ శాసనంలో పేర్కొన్నాడు.
దీన్ని బట్టి పంపన తండ్రి భీమప్పయ్య వేంగీపురం (నేటి బాపట్లకు సమీపంలోని వంగిపర్రు) ప్రాంతానికి చెందినవాడని, ఆ కుటుంబం వంగిపర్రు అగ్రహారాన్ని వదిలివేసి సబ్బినాడు లేదా సబ్బిమండలం (కరీంనగర్ ప్రాంతం)కు వలస వచ్చిందని అర్థమవుతుంది. కాగా కర్ణాటకలోని బావనాసిలో పంపన బాల్యం గడిచిందని, తర్వాత వేములవాడ చాళుక్యుల ఆస్థానంలో చేరాడని తెలుస్తున్నది. సాహితీ ప్రియుడైన అరికేసరి కొలువులో మహాభారతాన్ని విక్రమార్జున విజయం పేరుతో రచించి ఆయనకే అంకితమివ్వటంతో రాజు పంపనకు సబ్బినాడు మధ్యలో ఉన్న ధర్మపురిని అగ్రహారంగా ఇచ్చినట్లు ధర్మపురి పట్టణంలో లభించిన శాసనం తెలియచేస్తున్నది.
ధర్మపురి పొలిమేరలో ఉన్న వృషభాద్రిపై పంపన జీవిత విశేషాలను తెలియజేస్తూ ఆయన తమ్ముడు జినవల్లభుడు శాసనం వేయించాడు. ఈ శాసనంలోని పద్యాలు తెలుగు, కన్నడ, సంస్కృత భాషలో ఉన్నాయి. ఇందులోని సారాంశం ప్రకారం జినవల్లభుడు తన అన్న పంపనకు స్మారకంగా త్రిభువన తిలక అనే పేరుతో వసతి గృహాన్ని, మదన విలాస అనేపేరుతో ఉద్యానవనాన్ని నిర్మించాడు. వృషభాద్రి కింద చెరువు తవ్వించి దానికి కవితా గుణార్ణవ అని పేరుపెట్టాడు. చక్రేశ్వరీ దేవి, ఇతర జైన దేవతల విగ్రహాలు చెక్కించి పంపన సేవలను తెలియజేస్తూ శాసనం చెక్కించాడు. ఈశాసనాలపై ఉన్న తెలుగు పద్యాలు తెలుగు సాహిత్య ప్రాచీనతను నిరూపిస్తున్నాయి.
హోదా రావటం ఖాయం..
తెలుగుకు ప్రాచీన హోదా దక్కడం ఖాయమని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాంస్కృతిక, పర్యాటక, క్రీడా, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ధీమా వ్యక్తం చేశారు. ఈ హోదా వల్ల వచ్చే వంద కోట్ల రూపాయలతో హైదరాబాద్‌లోనే ప్రాచీన భాషా పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని వారు తెలిపారు. పంపన తెలుగులో నాలుగు గ్రంథాలు రాశారని, వాటిలో మూడు మద్రాస్ ఆర్కైవ్స్‌లో మరికొన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయని, ఒక గ్రంథానికి సంబంధించిన వివరాలు లభించలేదని భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి మామిడి హరికృష్ణ నమస్తే తెలంగాణకు చెప్పారు. - ఫొటో కర్టెసీ: రాష్ట్ర పురావస్తుశాఖ సంచాలకులు
ప్రాచీన హోదాకు పంపన్న తొవ్వ
ఆధిపత్య భావజాలంలో తెలంగాణ తెలుగు సాహిత్యాన్ని విస్మరించిన గత తెలుగు పాలకులు నన్నయ్యే ఆదికవి అనే వాదనను పట్టుకు వేలాడి తెలుగు భాషకు ప్రాచీన హోదా తేవటంలో విఫలమయ్యారు. ప్రాచీన హోదాకు సాహిత్యానికి వెయ్యేండ్లు, భాషకు పదిహేను వందల సంవత్సరాల చరిత్ర ఉండాలి. తెలుగుకు ప్రాచీన హోదాపై మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం నడుస్తున్నది. నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్నయ్యను ఆదికవిగా, ఆంధ్రమహాభారతాన్ని తొలి కావ్యంగా వాదనలు చేసింది. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందిన కవి కావడంతో తెలుగు సాహిత్య చరిత్రకు వెయ్యేళ్ల ప్రాచీనతను చూపలేకపోయింది. ఆ తర్వాత వాదనలకు దూరంగా ఉండిపోయింది. రెండేండ్ల క్రితం ఆ కేసు విచారణకు హాజరుకావాలని రెండు తెలుగు రాష్ట్రాలకు నోటీసులు అందాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించకున్నా తెలంగాణ ప్రభుత్వం ఈ కేసుపై ఆసక్తితో అధ్యయనానికి శ్రీకారం చుట్టింది.
ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య ఆదేశంతో భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి మామిడి హరికృష్ణ తెలంగాణ తెలుగు భాషకు ఉన్న ప్రాచీనతను కోర్టుకు వివరిస్తూ అఫిడవిట్ రూపొందించారు. నన్నయకు పూర్వం ఉన్న కవిత్వానికి సంబంధించిన ఆధారాలను తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సేకరించింది. ఉట్నూరు, కోటిలింగాల, ధూళికట్ట ప్రాంతాల్లో లభించిన ప్రాచీన శాసనాల భాష ఆధారంగా తెలుగుకు 2 వేల సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉందని కోర్టుకు నివేదించింది. పంపనకంటే ముందే తెలుగు సాహిత్యం ఉందని తెలంగాణ ప్రభుత్వం వాదన వినిపించింది.
కరీంనగర్ జిల్లాలోని కురిక్యాలలో లభించిన 10 శతాబ్దానికి చెందిన శాసనంలో లభించిన కంద పద్యాన్ని కౌంటర్ అఫిడవిట్‌లో ప్రస్తావించారు. జినవల్లభుడు వేయించిన ఈ శాసనంతోపాటు మరికొన్ని శాసనాలను ప్రస్తావించారు. కన్నడ ఆదికవి పంపనను తెలుగు వాడిగానే కాక తెలుగు కవిగానూ గుర్తించాల్సిన అవసరాన్ని చెప్తూ కోర్టుకు ఆయన రాసిన గ్రంథం జినేంద్ర పురాణం వివరాలతోపాటు, పురాణంలోని అందుబాటులో ఉన్న పద్యాలను కోర్టుకు నివేదించారు. శాతవాహనుల శాసనాల ఆధారంగా తెలుగుకు భాష చరిత్ర, పంపన సాహిత్యం ఆధారంగా ప్రాచీనత వెలుగులోకి రావడంతో తెలుగుకు ప్రాచీన హోదాపై ఉన్న అభ్యంతరాలు క్రమంగా తొలిగిపోతున్నాయి.
పంపన తన కవిత్వాన్ని చాళుక్య రాజులకు అంకితమిచ్చాడు. చాళుక్యులు కన్నడిగులు కావడంతో కన్నడనాట రాజ్యాలు మారినా ఆయన సాహిత్యం ప్రాచుర్యంలోనే ఉండగలిగింది. వృద్ధాప్యంలో సన్యసించిన పంపన బోధన్‌లో సజీవ సమాధి అయ్యాడు. ఆ సమాధి వద్ద ఆయన జీవిత విశేషాలు, మరణ కాలాన్ని తెలిపే శాసనం ఉంది. ఆ శాసనంలో సైతం తెలుగు, కన్నడ, సంస్కృత భాషలో పద్యాలున్నాయి. కన్నడ సాహిత్యానికి అతి పురాతనమైన కవిత్వాన్ని అందించిన పంపన కన్నడ భాషలో ఆదికవిగా నిలిచిపోయాడు. తెలుగువాడైన పంపన తెలుగులోనూ రచనలు చేసినట్లుగా ఆధారాలున్నా, జైన, బౌద్ధ సంస్కృతి వర్ధిల్లిన నిజామాబాద్, కరీంనగర్‌లో ఆ కాలానికే తెలుగు సాహిత్యం ఉన్నట్లుగా పలు ప్రదేశాల్లో ఆధారాలు లభించినా.. తెలుగు సాహిత్యం మాత్రం పంపనను ఆదికవిగా కాదు, కనీసం తెలుగు కవిగా కూడా గుర్తించలేదు.
No comments:
Post a Comment