Saturday, April 28, 2007


నాగరాజు పప్పు
Wednesday, February 07, 2007

వాక్యం రసాత్మకం కావ్యం -- రెండో భాగం
కవిత్వంలో మెటాఫర్ ని విశ్లేషిస్తూ రాసిన వ్యాసం.గత 1500 సంవత్సారాల తెలుగు కవిత్వ చరిత్రలో, పోయటిక్ మెటాఫర్ లో చాలా మార్పులూ, చేర్పులూ వచ్చేయి. ఈ కోణంలోంచి, తెలుగు కవిత్వాన్ని- వస్తు విషయ వర్ణన, భావ వ్యక్తీకరణ, అనుభూతి చిత్రీకరణ అని స్తూలంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.ఈ వ్యాసం మొదటి భాగంలో Structural Aspects ని వివరిస్తూ, తెలుగు కవిత్వాన్ని మూడురకాలుగా విభంజించేంకదా - పద్య కవిత్వం, గేయకవిత్వం, వచన కవిత్వం అని. Metaphoric Aspects లో ఈ మూడింటినీ పద సౌలభ్యం కోసం - ప్రబంధ కవిత్వం, భావ కవిత్వం, అనుభూతివాద కవిత్వం అని అందాం.నిజానికి సాంకేతికంగా, ఈ వర్గీకరణని పండితులు ఒప్పుకోరు. ప్రాచీన కవిత్వాన్నంతా ప్రబంధ కవిత్వం అనడం నిజానికి కుదరదు, అలాగే, గురజాడ నుంచి, మొన్నటి తిలక్ దాకా వచ్చిన కవిత్వాన్నంతా భావ కవిత్వం అనడం కూడా సమంజసం కాదు. నిన్నటి నగ్నముని నుంచి ఇవాల్టి సీతారామ శాస్త్రి వరకు ఉన్న కవులందరినీ అనుభూతి వాదులనడం కూడా తప్పే. అయితే ఈ పదాలని నేను సౌలభ్యం కోసం వాడుతున్నాను. తెలుగు కవిత్వ చరిత్రని మెటాఫర్ కోణం లోంచి, విశ్లేషించడానికి, ఈ వర్గీకరణ సరిపోతుంది.ఇంతకు ముందు చెప్పుకొన్నట్టుగా, కవి గులాబిమొక్కలాంటివాడు. ఎలాగైతే ఓ గుప్పెడు మట్టిని, గ్లాసుడు నీళ్ళనీ అందమైన గులాబీపువ్వుగా రూపొందించడానికి మొక్క ఎంత మధన పడుతుందో అలాగే కవి కూడా బాహ్యప్రపంచంనుంచీ అందిన ప్రేరణని, అది తనలో రేపిన స్పందనని కవితగా మలచడానికి అంతే తపన పడతాడు. అందుకే All poetry is metaphorical and allegorical. ప్రేరణ బాహ్య ప్రపంచానికి సంబందించినదైతే స్పందన అంతర్లీనమైన భావ ప్రపంచానికి సంబందించినది.ఉదాహరణకి, విశాఖపట్నం రామకృష్ణా బీచ్ దగ్గర (ఆంధ్రా యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్ దగ్గర) ఓ అందమైన అమ్మాయి కనిపించిందనుకోండి. ఇది అబ్బాయిలందరికీ చాల చక్కటి ప్రేరణ. చాలమందికి స్పందించే హృదయాలు కూడా ఉండొచ్చు. కాని, ఆ స్పందనని ఎలా వర్ణిస్తారు? ఓ చురుకైన గడుగ్గాయి "అబ్బా - అచ్చు కేలండర్ లో లక్ష్మీ దేవి బొమ్మలా ఉంది కదరా" అంటాడేమొ. ఆ మాట, ఆ వయ్యారి చెవిన పడి, ఆవిడ చెయ్యి పైకెత్తుతే - కాసులు రాలకపోయినా, మన గడుగ్గాయ్ పళ్ళు మాత్రం రాలతాయి. రసికరాజుల సంగతటుంచి, ఆ సమయానికి అక్కడ ఓ ముగ్గురు కవిరాజులు - ముక్కు తిమ్మన, కృష్ణశాస్త్రి, గుంటూరు శేషేంద్ర శర్మ ఉన్నారనుకోండి - అదే - ఉన్నారని ఊహించుకోండి.సాయంకాలం, సాగరతీరం, ఆపైన సౌందర్య దర్శనం - ఇంకాగుతారా?ముక్కు తిమ్మనగారు వెంటనే, బిలహరి రాగంలో గొంతెత్తి:"నానాసూనవితానవాసనల నానందించు సారంగమేలాననొల్లదటంచు గంధఫలి పల్కాకన్ దపంబొంది యోషా నాసాకృతి దాల్చి సర్వసుమస్సౌరభ్య సంవాసియైపూనెం బ్రేంఖణమాలికా మధుకరీపుంజబు నిర్వంకలన్"అంటూ పరవశించిపోతారు. (నిజానికీ పద్యం, ముక్కుతిమ్మన పారిజాతాపహరణంలో సత్యభామ ముక్కుని వర్ణిస్తూ రాసిన పద్యం కాదు. రామరాజభూషణుని వసుచరిత్రలోనిది. కాని, సాహితీలోకం ఎందుచేతనో ఈ పద్యాన్ని ముక్కు తిమ్మనగారికే అంటగట్టింది)దీనర్దం ఏమిటంటే - పూలన్నిటినీ వాసన చుసే తుమ్మెద తన దరికి రాదెందుకని సంపెంగె పువ్వు కినుకబూని, ఘోరమైన తపస్సుచేసి, చక్కదనాల చిన్నదాని ముక్కుగా అవతారమెత్తి, తానే పూలన్నిటినీ వాసన చుస్తూ, చూపులతూపులనే తుమ్మెదగుంపులని తనకిరుపక్కలా ఎల్లప్పుడూ ఉంచుకొందట.మహానుభావుడు నాలుగు పాదాల్లో ఎంత మందు దట్టించేడో గమనించేరా? ఇదీ మెటాఫరంటే. తెలుగు సాహిత్యంలో ఎన్నదగిన పద్యాలలో ఇదొకటి. అందుకు కారణాలు లేకపోలేదు. మొదటి కారణం - అందమైన ముక్కుని సంపెంగె పువ్వుతో పోల్చడం అదే మొదటిసారి. అంతవరకూ, ఆంధ్రదేశంలోని ఆడవాళ్ళ ముక్కులన్నీ అచ్చుగుద్దినట్టు ఒక్కలాగే ఉండేవి పాపం - కోటేరుల్లాగ. ఒకటిరెండు వేరే రకాలున్నా, ఆ నాసికలు వాసికెక్కలేదు.ఇక రెండో కారణం - మహాకవెప్పుడూ, తను చెప్పేదానికంటే, చెప్పకుండా మనకి స్పురింపచేసేదే ఎక్కువుంటుంది. దీన్నే, 'ధ్వని' అంటారు. ధ్వని మెటాఫర్ కి పరాకాష్ట. కినుకబూనిన సంపంగెకదా - మరుజన్మలో కూడా ఆకోపం రవ్వంత ఉంటుంది - పూర్వజన్మ వాసనలనుకోండి - సంపంగెకి వాసనెక్కువ కదా? అందుకే చక్కని చుక్కకి కోపం ముక్కుమీదుంటుందంటారు.తనని తప్ప మిగతా పువ్వులన్నింటినీ వాసన చూస్తుందని కదా ఈ సంపంగె కినుక? ఇందులో స్త్రీ సహజమైన ఈర్ష్య ధ్వనించటంలేదూ? అందుకనే, ఆ పూలన్నిటినీ తురిమేసి, తన జడలోకి తరిమేస్తుంది (అంటే తన ముఖానికి వెనకవైపుకి). తనుమాత్రం ఆ అందమైన ముఖానికి కొట్టచ్చేటట్టు - కొలువుదీరి కూర్చుంటుంది దర్జాగా.ఇకపోతే, వొయ్యారి చూపులని తుమ్మెదలతో పోల్చడంలోనే అసలు చమత్కారం అంతా ఉంది. అంతకు ముందు దాకా, చూపులని మన్మధబాణాలనే వారు. కాని, చూపులని తుమ్మెదలనడంలో ఒక చక్కటి 'చిత్రం' (ఫొటోగ్రాఫ్) ఉంది. ఇలా అనడం ద్వారా కవి మనకి ఆవిడ కళ్ళు ఎలా ఉంటాయో, చుపులెలా ఉంటాయో, ఆ చూపుల ప్రభావం ఎటువంటిదో - అన్నీ ఒక్క ఉపమానం ద్వారానే కళ్ళకి కట్టినట్టు తెలియజేసేడు. ఈ చంచలాక్షి కళ్ళు చాలా నల్లగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, ఎప్పుడూ అటూ ఇటూ చూస్తూంటాయి. ఆ చూపు తగిలినవాడికి కలిగే గిలిగింత తుమ్మెద కాటులా ఉంటుది - ఒళ్ళు జలదరిస్తుందన్నమాట. తుమ్మెదకాటులో ఒకరకమైన విషం ఉంటుదికదా - దాని ప్రభావం వల్ల మైకం కమ్మి, మత్తెక్కుతుంది కూడాను.ఇన్ని రకాల మెటాఫర్లున్నాయి ఈ పద్యంలో. ఇలాంటి పద్యాలు ప్రబంధ సాహిత్యంలో కోకొల్లలు. ఐతే, అవన్నీ ప్రదానంగా వస్తు వర్ణనలే - అంటే, అమ్మాయి అందాన్ని వర్ణించడం ఈ పద్యంలో కవితా వస్తువు. ప్రబంధ సాహిత్యంలో మెటాఫరంతా సుమరుగా వర్ణనకి సంబందించినదే. భావ కవిత్వంలో, బాహ్యమైన వస్తువుని కాకుండా, మానసిక ప్రపంచాన్ని - కంటిక్కనిపించని భావాలని వ్యక్తపరచడం ముఖ్యమైన కవితావస్తువు.అయితే, భావకవిత్వం ఏదో ఒక్క సారిగా పుట్టుకు రాలేదు. ఈ మార్పు చాపకింద నీరులా చాలా నెమ్మదిగా వచ్చింది. నన్నయ్యతో ప్రారంభమైన తెలుగు కవిత్వం, శ్రీనాధుడి కాలానికి ప్రబంధ కవిత్వం రూపులని సంతరించుకొంటే, పోతన కవిత్వంలో భావకవిత్వానికి అంకురార్పణ జరిగింది. ఈ పరిణామాన్ని కొంచెం క్లుప్తంగా ఇక్కడ చెప్పుకొని, ఆ తర్వాత భావకవిత్వంలోకి దూకుదాం.ప్రాచీన కవిత్వంలో మొత్తం కథంతా పద్య రూపకంగానే చెప్పేవారు. అందుచేత వర్ణనలెక్కువ. అంతమాత్రంచేత కేవలం వర్ణనలే ఉన్నాయనుకొంటే పొరపాటే. ఒక కథలో పాత్రలని, వాళ్ళ వ్యక్తిత్వాలని పరిచయం చేయాలంటే - కంటికి కనిపించని మనస్తత్వాన్ని మనకు చూపించ గలిగే భావ వ్యక్తీకరణ కావాలి కదా?ఉదాహరణకి, తిక్కన మహాభారతంలో ఏ వ్యక్తినీ కేవలం భౌతికమైన వర్ణన చెయ్యడు. ఆ వ్యక్తి కదులుతున్నప్పుడో, ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడో, పూలుకోసుకొంటున్నప్పుడో - ఇలా కదలికతోనే ఆయన మనుషులని మనకి పరిచయం చేస్తాడు. అందుకే, తిక్కన భారతం శ్రవ్య కావ్యం ఐనప్పటికీ, దృశ్యకావ్యంగా కూడా ప్రసిద్దికెక్కింది. ఉదాహరణకి, ధర్మరాజు - రాజశూయం చేసిన చక్రవర్తి. సామ్రాట్టులకి సామ్రాట్టు, అయినా కూడా వినయ గుణ సంపన్నుడు. మాములు కవైతే, రాజాది రాజ, రాజపరమెశ్వర అంటూ పొగడ దండల దండకం చెప్పేవాడేమో - తిక్కన మహాకవులకి మహాకవి. అందుకే ఆయన "ఎవ్వనివాకిట నిభమదపంకంబు రాజభూషణరజో రాజి నడగు" అంటూ మొదటి పాదంలోనే కొండలని పిండిగొట్టెస్తాడు. ఆ తర్వాత, పాదం మీద పాదం పెంచుకొంటూపోయి, చివరకి:నతడు భూరిప్రతాప మహాప్రదీప దూరవిఘటిత గర్వాంధకార వైరివీరకోటీర మణిఘృణి వేష్టితాంఘ్రితులుడు కేవల మర్త్యుడే ధర్మసుతుడుఅంటూ ధర్మరాజు గొప్పదనాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆయన యశోవైభవాన్ని మన కళ్ళకి కట్టినట్టు చెప్తాడు.ఇక్కడ నన్నయ్య భారతానికి, తిక్కన భారతానికి మద్యగల మెటాఫర్ లోని తేడాని కుడా ఒకసారి చెప్పాలి. నన్నయ్య భారతంలోని వ్యక్తులందరూ ఉదాత్తంగా మనకి కనిపిస్తారు - వాళ్ళు మనకందనంత ఎత్తులోనే ఎప్పుడూ ఉంటారు. నన్నయ్య భీముడు ఎవరిమీదనైనా కోపంవస్తే - మూఢమతీ అనో, మూర్ఖుడా అనో గంభీరంగానే తిడతాడు - తిక్కన భీముడైతే - పోవోయ్ తువ్వాయ్ అనగలడు. ఇంకా 'తిక్క'రేగితే - లకారాలు కూడా అందుకోగలడు. తిక్కన భారతంలోని పాత్రలు మనలాగే భూమిమీదుంటారు, మాములు మనుషులు, వాళ్ళ కోపతాపాలు కూడా మనకి బాగా అందుబాట్లొ ఉంటాయి. ఈ తేడా ఇక్కడ ఎందుకు చెప్పేనంటే - ఈ తేడా కేవలం వర్ణనలో ఉన్న వైవిద్యంకాదు, వీరిద్దరి పొయిటిక్ మెటాఫర్ లోఉన్న తేడా.ఇక, పోతన భావకవులకి చాల దగ్గరగావచ్చే ప్రాచీన కవి. గజేంద్రుడిని రక్షించడానికి మహావిష్ణువు వైకుంఠంలోంచి ఎలాఉన్నవాడు అలాగే బయలు దేరిపోయేడట. సిరికిన్ చెప్పడు అన్న పద్యం అందరికీ తెలిసిందే కదా? భక్తులని రక్షించడానికి భగవంతుడు ఎంత తొందరపడతాడో చెప్పడానికి పోతన కనిపెట్టిన మెటాఫరది.అలాగే, వామనచరిత్రలో - వామనుడు - ఇంతింతై వటుడింతై అన్నట్టు ఆకాశానికి, అక్కడనుంచి అంతరిక్షానికి ఎదిగి పోతున్నాడు. అలా ఎదిగి పోతున్న త్రివిక్రముడి ఎత్తు మనకి చెప్పడానికి - కాదు - మన కళ్ళకి కట్టినట్టు చూపడానికి - పోతన ఒక కొత్త మెటాఫర్ కనిపెట్టేడు. అది సూర్యబింబాన్ని కొలతబద్దగా స్వీకరించటం:రవిబింబం బుపమింప బాత్రమగు చత్రంబై శిరోరత్నమైశ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమైఛవిమత్కంకణమై కటిస్తలి నుదంచద్ఘంటయై నూపురప్రవరంబై పదపీఠమై వటుడు దాబహ్మండమున్ నిండుచోన్ఆదిలో, పెరుగుతున్న వామనమూర్తికి సుర్యబింబం గొడుగుగా కనిపించింది, ఆ తర్వాత శిరోమణిగా అయింది, తర్వాత క్రమక్రమంగా, చెవికమ్మగా, కంఠాభరణంగా, భుజకీర్తిగా, కరకంకణంగా, మొలగంటగా, కాలికడియంగా, చివరకు పాదపీఠంగా మారిపోయింది. మొదట ఛత్రంగా ఉన్న సుర్యుడు ఆఖరికి పాదపీఠంగా అయినాడంటే, స్వామి ఎంత ఎత్తు పెరిగిపోయేడో మనలనే ఊహించుకోమన్నాడు మహాకవి. ఇందులో రవిబింబానికుపయోగించిన ఉపమానాలన్ని - గుండ్రంగా ఉండడం మరో ఎత్తు.సాగరమదనం కథలో, దేవగణాలన్నీ ప్రార్ధించటంతో శివుడు హాలాహలాన్ని తాగడానికొప్పుకొన్నాడు. ఉబ్బు శంకరుడు కాబట్టి ఆయన ఒప్పుకోవచ్చు, కాని ఆయన భార్య పార్వతి అందుకుఎలా సమ్మతించిందో? సాధారణంగా, మొగవాడు గొప్పలకిపోయి దారి తప్పుతూంటే - ఆడది అతనికి బుద్ధి చెప్పి దారికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది కదా? మరి పార్వతి తన మొగుడు విషం తాగుతానంటే అందుకు ఎలా ఒప్పుకొంది?మ్రింగెడువాడు విభుండనిమ్రింగెడునది గరళమనియు మేలన్ ప్రజకున్మ్రింగుమనె "సర్వమంగళ"మంగళసూత్రంబు నెంత మదినమ్మినదోప్రజలకు మేలుకాబట్టి, తన మంగళసూత్రాన్ని నమ్ముకొని, మింగమందిట. అందుకనే ఆవిడ సర్వమంగళైందని పొతన కితాబు. ఇక్కడ సర్వమంగళ అన్న ఒక్క పదంలో తన భావకవితా ప్రతిభనంతా ప్రదర్శించేడు పోతన. పార్వతికి ఆపేరు అంతకు ముందునుంచే ఉన్నా - దానికి సార్ధకత పోతన పద్యం ద్వారానే వచ్చిందేమో. శివుడు గరళం మింగడానికి ముందే, ఆవిడ ఎంతో బాధని, ప్రజల మేలుకోరి, మింగిందని ఆవిడమీదే పోతనకెక్కువ అభిమానం. అందరి మేలు కోరేది కాబట్టి ఆయమ్మ సర్వమంగళైతే, అందరికీ శుభం చేసేవాడు కాబట్టి ఆయన శంకరుడైనాడు.ఈరకంగా భావకవిత్వం ఛాయలు ప్రాచీన కవిత్వంలోను, ప్రబంధ కవిత్వంలోనూ ఉన్నాయి - కృష్ణశాస్త్రి కాలానికి అవి బాగా ఊపందుకొన్నాయి. ఇక్కడతో ప్రబంధ కవిత్వానికి స్వస్తి చెప్పి, భావ కవిత్వానికొద్దాం.విశాఖపట్టణం బీచ్ లో ముగ్గురు మరాఠీలని ప్రవేశ పెట్టేం కదా. అందులో, తిమ్మన గార్ని తుమ్మెద కాటేసింది. ఆ గొడవేదో ఆయనకే వదిలేసి, కృష్ణశాస్త్రి సంగతికొద్దాం. కృష్ణశాస్త్రికి అమ్మాయి అందంతో పనిలేదు. చిన్నారి చూపుల తూపుల దెబ్బకి తనలొ కలిగిన స్పందనే ఆయన కవితా వస్తువు:"తీయ తేనియ బరువుమోయలేదీ బ్రతుకు"అంటూ పాపం అక్కడే కూలబడిపోతాడు. ప్రబంధ కవిత్వం నుంచి భావకవిత్వానికొచ్చేసరికి మెటాఫర్ ఎంత మారిపోయిందో చూసేరా? బాహ్యమైన వస్తువుని చెప్పడానికి వర్ణన సరిపోతుంది, కాని మదిలో మెదిలిన మధురమైన ఊహని చెప్పడానికి 'abstraction' కావాలి. స్పందనకి స్పష్టమైన రూపుండదు కదా?ఇటువంటి భావకవిత్వానికి ప్రాణంపోసింది పెర్షియన్ మాహాకవులు - హఫీజ్, జామి, రూమి, అత్తర్, హకిమ్ సినాయ్, ఒమార్ ఖయ్యామ్ మొదలైన రసరాజులు. ఆ తర్వాత, ఉర్దూలో - గాలిబ్,ఫిరదౌసి లాంటి కవిరాజులు. దీన్ని తెలుగులోకి తెచ్చిన వాళ్ళు - రాయప్రోలు, అబ్బూరి మొదైలైన వాళ్ళు. తెలుగులో భావకవిత్వానికి ప్రాణంపోసి, దాన్ని సజీవ ధారగా చేసిన భాగిరథుడు కృష్ణశాస్త్రి.విరుద్దమైన, వ్యతిరేకమైన పదాల కలియకతో అద్భుతమైన ఒక కొత్త మెటాఫర్ని తయారు చేయడంలో కృష్ణశాస్త్రి - సిద్దహస్తుడు. రాగిని బంగారంగా మార్చే పసరువేదుంది ఆయన దగ్గర. విరుద్దమైన పదాలకలియకతో కృష్ణశాస్త్రి సృష్టించే ఇంద్రజాలం చూడండి:"మురళి పాటకు రగిలిమరుగునీ వెన్నెలలుసొగయి నా ఎదకేలతగనీ సౌఖ్యజ్వాల?"తీయ తేనియ బరువు, రగిలిపోయి, మరిగిపోయే వెన్నెలలూ, సౌఖ్యజ్వాలలూ - ఇవన్నీ, కొత్త మెటాఫర్లు - అంతకు పూర్వం ఏకవి తెలుగులో అలాంటి expressions వాడలేదు. ఒక కొత్త మెటాఫర్ సృష్టించడంలోనే కవి గొప్పదనం అంతా ఉంది. ఇలాంటి మెటాఫర్లు మనకి కవి మనసులోని స్పందనని మనకు అందచేస్తాయి. మరిగిపోయే వెన్నెలలని మనం ఒక దృశ్యంలాగ ఊహించుకోలేం, కాని కవి చెప్పదలుచుకొన్న ఊహని మనం ఆశ్వాదించగలం.చాలవరకు, కృష్ణశాస్త్రి కవిత్వంలో, Conscious Suffering అనేది ప్రదానమైన కవితా వస్తువు."మలిన భాష్ప మౌక్తికమ్ముమిలమిల నీ కనుల మెరియతళతళ మని తారలు నటయించునురా పాపి""భరియింపగరాని లజ్జశిరము వంగి కృంగినంతతెరలదాటి చందమామ నవ్వునురా పాపి"ఇంత అందంగా Longing & Conscious Suffering ని చెప్పే కవితలు ప్రపంచ సాహిత్యంలోనే బహుఃసా చాలా అరుదుగా ఉంటాయేమో!అలాగే, ఇంకో కవితలో - ఆరాధనలో ఉండే Constant Remembrance ని కృష్ణశాస్త్రి చాల చిత్రమైన, విరుద్దమైన మెటాఫర్ లో చెప్తాడు:"నీ పిలుపు వినక గాఢనిదురలోన మునిగియున్ననిష్ఠురాఘాతముతోనీవే మేలుకొలిపి, ప్రభూమరలి వెడలిపోకుమాకరుణ క్షణము నిలబడుమా"చెట్టునో, పువ్వునో వర్ణించవచ్చు, అందాన్ని కొంతవరకూ వర్ణించవచ్చు, వసంతాన్ని, వెన్నెలలని వర్ణించవచ్చు. కాని, గర్వాన్ని, వినయాన్ని, మన మనసుకు హత్తుకొనేలా ఎలా వర్ణించడం? పూలజాతర అనే కవితలో:పచ్చనాకుల రాణివాసపుపడతినే, నే సంపంగెనేసరసులను సామంతులను నాస్వాదువాసన పిలుచునేఅని ఒక సంపెంగ పువ్వు బీరాలు పోతుంటే, ఇంతలో ఒక గడ్డి పువ్వు:దారి పక్కను గడ్డిసజ్జెనుదాగిఉండే బీదను, నిరుపేదనుపూజకంటే వస్తిని, ఏ మోజులేనిచిన్నివిరిని, ప్రభువు కొలువునదాసిని, శ్రీపదములకు తివాసినిఅంటుంది. "Ego, Humility" అనే concepts ని, మన మెదడుకి కాకుండా, మన మనసుకి direct గా అందేలా చేస్తుందీ కవిత. కవి మనకి అందచేద్దామనుకొన్న 'feeling' ఎంత abstract ఐతే, మెటాఫర్ కూడా అంత abstract గా ఉంటుంది మరి. గొప్ప భావకవిత్వంలో మన అంతఃప్రపంచానికి సంబందించిన వస్తువుని మనముందు "చిత్రీకరించే" మెటాఫరుంటుంది. భావకవి దృశ్యాన్ని మట్టుకే వర్ణించడు, ఆ దృశ్యంలో నిబిడియున్న నిబద్ధమైన ప్రపంచాన్ని వర్ణిస్తాడు. అందుకే, poetry is felt before it is understood. Logical Analysis కి ఇటువంటి మెటాఫర్ అందదు. తేనియకి బరువేముటుంది? వెన్నెనలు మరగడమేంటి?ఈ మధ్య నేరాసిన ఓ కవిత చదివి, ఒకరు ఆకులు పువ్వులవ్వవు కదండీ - ఇది సైన్స్ కి విరుద్దం అన్నారు. మరి ఆకులు ప్రేమిస్తాయా? Poetry doesn't simply ask for faith - it demands a leap of faith. విశ్వకవి టాగొర్, ఇలాటి విశ్లేషణలతో విసిగిపోయి:If I say the Earth is flat - you tell me that my near vision is falseIf I say that the stars are fire flies in the night forest of the sky, you tell me that my far vision is false.నయనానికి చూపుంది కాని, అది ప్రపంచాన్ని దర్శించ గలదా? నిజాన్ని చూడడంకాదు, సత్యాన్ని దర్శించడం కళల పరమావధి.ఇదీ భావకవిత్వంలో మెటఫర్ గొడవ. ప్రబంధ కవిత్వానికి, భావ కవిత్వానికి ముఖ్యమైన తేడా - వర్ణన ప్రబంధ కవిత్వంలో ప్రదానమైన కవితా వస్తువైతే, కనిపించని, అంతర్లీనమైన భావాలని, స్పందనని వ్యక్తపరచడం భావకవిత్వంలోని ప్రదానమైన కవితా వస్తువు (పొయిటిక్ మెటాఫర్ కోణంలోంచి చూస్తే). అయితే, ప్రాచీన కవిత్వంలో 'abstraction' లేదనీ కాదు, భావ కవిత్వంలో వస్తు వర్ణన లేదనీ కాదు. ఇవి కవిత్వాల తిరుతెన్నులని నిర్వచించే ప్రదానమైన అంశాలు మాత్రమే.ఎలాగైతే, ప్రబంధ కవిత్వంలో అంకురార్పణ చేసికొన్న భావకవిత్వం కృష్ణశాస్త్రి కాలానికి మహావృక్షంగా ఎదిగిందో, కృష్ణశాస్త్రి కాలంలోనే బాలసారె చేసికొన్న అనుభూతివాద కవిత్వం గుంటూరు శేషంద్ర శర్మ, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి మొదలైన వాళ్ళ ఆలనా పాలనల్లో పెరిగి పెద్దదైంది.భావకవిత్వంలో మెటాఫర్ ముఖ్యమైన కవితా వస్తువైతే, అనుభూతివాద కవిత్వం - allegorical గా ఉంటుంది. నయనానికి, దృశ్యానికి మద్యనుండే అనంతమైన ఆకాశాన్ని, దానిలో నిగూఢమైన రహస్యాలని అందుకోడానికి అనుభూతివాది ప్రయత్నిస్తాడు.ఆ గొడవంతా మరికొద్ది రోజుల్లొ -
మూడో భాగంలో చెప్పుకొందాం.
అప్పటిదాకా శేషేంద్ర శర్మతో ఈ వ్యాసం సశేషం.

No comments: