Saturday, April 28, 2007

నాగరాజు పప్పు
(కళాతత్త్వ శాస్త్ర విద్యార్థులకు ఉపయోగపడే కొన్ని వ్యాసాలను నాగరాజు పప్పు గారు రాస్తున్నారు. వాటిని వారి పేరుతోనే ఇక్కడ పునర్మిద్రిస్తున్నాను - దార్ల )


Sunday, February 04, 2007

వాక్యం రసాత్మకం కావ్యం
వాక్యం రసాత్మకం కావ్యం -- మొదటి భాగం(ఈ వ్యాసం - ప్రాచీన కవిత్వం దగ్గర నుంచి, ఆధునిక కవిత్వం వరకూ గల విభిన్నమైన కవితా రీతుల గురించి, వస్తు వర్ణన మొదలుకొని రసావిష్కరణ వరకూ గల రకరకాలైన భావ వ్యక్తీకరణ పద్దతుల గురించి, ఈ మధ్య వస్తున్న అనుభూతి కవిత్వాన్ని గురించి విశ్లేషించడానికి చేసిన ప్రయత్నం. ఇందులో కవితలు రాయదానికి కొన్ని చిట్కాలూ, పద్దతులూ కూడా - నాకర్ధమైనంతలో చెప్పడానికి ప్రయత్నించేను. అలాగే, అనుభూతి కవిత్వాన్ని ఆస్వాదించటం ఎలాగో కూడా చెప్పే ప్రయత్నం.)మా ఇంటిలో రమారమి అందరూ - `రాతా'సురులే. కొందరు పద్య కవిత్వం రాస్తే, కొందరు గేయకవిత్వం, మరికొందరు కధలు, వ్యాసాలు రాస్తారు. అన్ని ప్రక్రియలలో చెయ్యి కాల్చుకొన్న వాడు మా మావయ్య ఒక్కడే. సుమారు పాతికేళ్ళ క్రితం - అప్పటికింకా బాగా చిన్న వాణ్ణి - "మావయ్యా - కవితలు రాయడం సుళువా, కధలు రాయడం సుళువా" అని అడిగా. ఆయనొక క్షణం ఆలోచించి, ఓ సిగరెట్టు, దానితో పాటుగా ఇంకో చిరునవ్వు వెలిగించి - "రాయడం వరకే అయితే - కవితలే సుళువు" అని చమత్కరించేడు. ఆ చమత్కారంలో ఉన్న మడత పేచీ నాకీ బ్లాగు మొదలుపెట్టే దాకా తెలిసి రాలేదు.కవితల జోలికెళ్ళే ఉద్దేశ్యం మొదట్లో నాకే కొసనా లేదు. మేధావి వర్గం వాళ్ళం కదా - మాకు మెదడు పెద్దదీ గుండె చిన్నదీను. అందుచేత, ప్రేరణ ఎక్కువ స్పందన తక్కువ. ఈ అనుభవించి పలవరించడం లాంటి గొడవలు మనకెందుకులే - ఊకదంపుడు ఉపన్యాసాలు మనకి వెన్నతో పెట్టిన విద్యే కదా - హాయిగా ఏవో వ్యాసాలు, కథలు రాసుకొందాం అనుకొన్నాను. మొదలెట్టిన తర్వాత తెలిసింది - పెద్దపెద్ద వ్వాసాలు 'రాయటం' ఎంత కష్టమో. ముందు ఆలోచించాలి - ఇది అన్నిటికీ ఉన్నదే, ఆలోచించిన దాన్ని ముందు 'draft version' రాయాలి, ఆ తర్వాత దానికి మెరుగులు దిద్దాలి. ఆ పైన `అప్పుతచ్చులు' సరిదిద్డాలి. తెలుగు రాసి చాలా కాల మైందేమో - అచ్చుతప్పులు చాలానే దొర్లుతాయి - సత్యాలు శివాలై పోతూంటాయి. ఒక అక్షరం కింద ఉండాల్సిన ఒత్తులు, పక్క అక్షరం మేదికి ప్రేమతో ఒరిగిపోయి, జరిగిపోతూంటాయి. మరికొన్నైతే లేచిపోతాయి కూడ. ఈ బాధలన్నీ పడిన తర్వాత, కంప్యూటర్ లోకి ఎక్కించడం ఇంకో తలకాయ నోప్పి. ఎడం చేతి చిటికెన వేలితో నిమిషానికి పదిసార్లు 'shift' key నొక్కాలంటే - చేతులు నొప్పి. మొత్తం మీద రెండు వ్యాసాలు పూర్తి చెయ్యడానికి ఆరు మాసాలు పట్టింది. అందుకని ఈ 'రాయటం' బాధలు పడలేక కవిత్వం 'చెప్పేద్దాం' అనుకొన్నాను - కవితలైతే ఒక ఐదారు లైన్లలో కొట్టేయ్యచ్చు కదా!కాని, కవిత్వం మనకి చెప్పడం రాదే - మొదట్లో రాసిన కవితలు - నర్సు ఆపరేషన్ చేసినట్టుండేవి - వాటిని చదివితే నాకే చిరాకేసేది. ఇప్పటికీ అలానే ఉంటాయ్ అని మీరనుకోవచ్చనుకోండి - మీ అభిప్రాయం మార్చడానికే మరి ఈ ప్రయత్నం.కవితలు రాయాలంటే - ముఖ్యంగా - వస్తువు, శైలి, శిల్పం కావాలి. వస్తువంటే - స్నేహం గురించి రాయొచ్చు. ప్రేమ గురించి రాయచ్చు, ప్రేయసి గురించి, ప్రకృతి గురించి రాయొచ్చు - కాకపోతే, పేదల బాధల గురించి కూడా రాయొచ్చు. ఇలాంటి వస్తువులన్నీ ఇప్పటికే మహామహులెందరో తుక్కు తుక్కుగా దున్నేసారు. కొత్తగా చెప్పడానికి ఏం కనిపించ లేదు. అదీగాక, మన తెలుగు కవులకి (ముఖ్యంగా ఆధునిక కవులకి)రెండు రకాల కామెర్లు - ఒకటి పచ్చకామెర్లు (ప్రకృతినీ, ఆకులనీ, కోయిలని చూసి మహా ఇదై పోతూంటారు - భావకవులన్న మాట), ఇంక రెండో తరహా వాళ్ళకి ఎర్రకామెర్లు - వీళ్ళు సామాజిక స్పృహంటూ బిచ్చగత్తెల మీదా, ఉంపుడుకత్తెలమీదా, కూలీల మీదా, కర్షకుల మీదా ఏదేదో రాసేసి, పాఠకుల మీద కవితల కేకలేస్తుంటారు. ఇంకపోతే, కాలేజి అమ్మాయిల కవితల తరహా వేరు - ప్రేమలు, దోమలు, వలపులు, విరహాలు, ఏడ్పులు, వీడ్కోళ్ళు - మొదలైన వాటి గురించి తెగ ఫీలైపోతుంటారు.ఈ తరహా కవిత్వం అంటే నాకు చచ్చేంత రోత. ఎంత ఆలోచించినా ఏం రాయాలో, ఎలా రాయాలో తెలీలేదు. అందుకని, రాయటం కట్టి పెట్టి, ఓ సంవత్సరం పాటు - అన్ని రకాల కవిత్వాలని చదవటం, విశ్లేషించటం మొదలెట్టేను. మంచి కవితలు రాయాలంటే ముందు మంచి కవితలు చదవాలి కదా?కవిత్వాన్ని మూడు కోణాల్లోంచి మనం విశ్లేషించ వచ్చు - వీటిని Structural, Metaphorical, Stylistic అందాం. Structural గా చూస్తే, తెలుగు కవిత్వం - పద్య కవిత్వం, గేయ కవిత్వం, వచన కవిత్వం అని స్తూలంగా మూడు రకాలుగా విభజించ వచ్చు. పద్య కవిత్వం అందరికీ తెలిసిందే - చెప్పదల్చుకొన్న విషయాన్నో, వస్తువునో - చంధస్సులో నిబద్దం చేస్తే అది పద్య కవిత్వం. ఇపుడు పద్య కవిత్వం చెప్పే వాళ్ళున్నారు కాని చాల తక్కువ. గేయ కవిత్వం అంటే పాడు కోవడనికి అనువుగా ఉండేది - సినిమా పాటలు, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి కవితలు చాలవరకు గేయ కవిత్వం అనచ్చు. ఇకపోతే వచన కవిత్వం - చాలవరకు కుర్రకారు కవిత్వం అంతా వచన కవిత్వమే. ఆత్రేయ, తిలక్ వీరిద్దరివీ వచన కవిత్వంలో అందెవేసిన చేతులు, ఈ ఇద్దరికి తప్పిస్తే వచన కవిత్వం చెప్పడం మరెవ్వరికీ సాధ్యం కాలేదేమో అనిపిస్తుంది. Structural గా చూస్తే, వచన కవిత్వం గేయ కవిత్వం కన్నా, గేయ కవిత్వం పద్య కవిత్వం కన్నా తేలికగా అనిపించొచ్చు. కాని, కవితకు భావం ప్రాణం అయితే, లయ ఊపిరి. లయంటే - కవిత చదువుతున్నపుడు దానికో ఊపు, తూపు ఉండాలి. ఈ లయని సాధించటంలోనే ఉంది కవి తాలూకు ప్రజ్ఞ్న అంతా. లయని తీసుకురావటం వచన కవిత్వంలో చాలా కష్టం. గేయ కవిత్వంలో కొంత కష్టం. పద్య కవిత్వం లో నైతే - లయ చంధస్సులో అంతర్లీనంగా ఉండనే ఉంటుంది - అందుకని పద్య కవిత్వంలో లయ గురించి ప్రత్యేకంగా కృషి చెయ్యక్కరలేదు.గేయ కవిత్వంలోనైతే - లయ సాధించటానికి కవి ఒక తాళాన్ని ఎంచుకోవచ్చు. ఆ తాళానికి - ఆది తాళమో, రూపక తాళమో - దానికి తగ్గట్టుగా పదాలని ఎంచు కొంటే - కొంత వరకూ లయని సాధించినట్టే. శ్రీశ్రీ లయని సాధించటంలో సిద్ధహస్తుడు. భావానికి తగ్గ ఉద్రేకాన్ని, శక్తిని తను ఎన్నుకొనే చంధస్సులో, పదాల అమరికలో సాధిస్తాడు. ఉదాహరణకి, మహా ప్రస్థానం మొదటి కవితలో ......పదండి ముందుకుపదండి తోసుకుపోదాం పోదాం పైపైకి ...ఇది చదువుతున్నప్పుడు - అందులో ఊపిరాడని ఉద్రేకం, విప్లవం ఉన్నాయి. అవి మనన్ని ఊపేస్తాయి. ఇదే కవితని, పదాలు అమరిక మార్చిరాస్తే.....ముందుకు పదండితోసుకు పదండిపైపైకి పోదాం పదండి..అన్నాం అనుకోండి - ఎలా ఉంది? బస్సు కండక్టరు ప్రయాణీకులని అదిలిస్తున్నట్టు లేదూ?కొత్త కవులూ, కుర్ర కవులూ - లయని సాధించటంలో సాధారణంగా పప్పులో కాలేస్తుంటారు. అంత్యప్రాస ఒక్కటే వీళ్ళకున్న పాసుపతాస్త్రం మరి - నారాయణ రెడ్డీ అనగానే బంగారు కడ్డీ అంటారన్న మాట.లయ మీద పట్టు సాధించటం వచన కవిత్వంలోనూ గేయ కవిత్వంలోనూ కష్టం అని ఎందుకన్నానంటే - పద్యానికైతే ముందే నిర్ణయించిన చంధస్సు, నియమాలు ఉన్నాయి. మనం చంధస్సుని సృష్టించుకోనక్కరలేదు. ఉన్నదాన్ని అర్ధం చేసుకొని ఉపయోగించుకోగలిగితే చాలు. ఉదాహరణకి, ఓ దండకం చెప్పాలనుకోడి - ఒక సగణం మీద వరసగా తగణాలు వేసుకొంటూ పోతేసరి. ఉదాహరణకి - పొగాకు మీద దండకం చెప్పాలనుకోండి - "కోటలో బైరుగావించి, ఒప్పుగా నిప్పు దెప్పించి మిక్కిలిన్ ప్రేమతో ధూపముల్ త్రాగువారెంత పుణ్యాత్ములో యెంత ధర్మాత్ములో" ఇలా చెప్పుకొంటూ పోవచ్చు.కాని, అదే గేయకవిత్వంలో, కవి తనకి కావల్సిన చంధస్సు, సాధించాల్సిన లయని తనే తయారు చేసుకోవాలి. ఇది కష్ట సాధ్యమైన పనే. కేవలం అంత్యప్రాసలతోనో, శబ్ధాలంకారాలతోనే అయ్యేపని కాదు. కొన్ని `చిట్కాలు' మాత్రం ఉన్నాయి. తెలుగులో, `క చ ట త ప' ల కీ, `గ స డ ద వ'ల కీ మధ్య చక్కటి సంభంధం ఉంది. మొదటి పాదంలో ఉన్న పద్యాల్లో `క చ ట త ప' లుంటే, రెండో పాదంలో అదేచోట `గ స డ ద వ' లొచ్చేటట్టు చూస్తే - కవితకి అంత్యప్రాసలతో దొరకని అందం వస్తుంది. చదువితున్న వాడికి `ట్రిక్కు' వెంటనే అందదు కాబట్టి ఇంకా రంజుగా ఉంటుంది. ఉదాహరణకి కరుణ శ్రీ పుష్ప విలాపం చూడండి. శ్రీశ్రీ, కృష్ణ శాస్త్రి, వేటూరి అందరూ చాల అందంగా ఈ ప్రయోగం చేస్తారు. ఇంక రెండో ట్రిక్కు, గేయ కవితల్లో, ప్రతి పాదం లోనూ పదాలు చాలా తక్కువగా ఉంటాయి - సాధారణంగా మూడుకి మించి ఉండవు. శ్రేశ్రే అయితే, చాలా వరకూ ఒక పాదంలో ఒక్క పదాన్నే వాడతాడు. వచన కవితని, గేయ కవితగా మార్చదలచు కొంటే, ప్రతి వాక్యంలో ఉన్న పదాలని తగ్గించి చూడండి - చాలావరకూ లయని సాధించవచ్చు. ఉదాహరణకి, ఈ మధ్య నే రాసిన `అనుభూతి కనువాదం' కవిత, మొదటి సారి రాసినపుడు ........నా కిటికీలోంచి తొంగి చూసేచిట్టి చిట్టి చిన్నారి ఉడతలునా మదిలో తొణికస లాడేచిన్ని చిన్ని ఊహల తలపులునా నుదుటనీ వద్దినచిరు ముద్దులు ....ప్రతి పాదాన్ని కొంచెం కుదిస్తే .....కొమ్మల్లోనారెమ్మలమీదఊయలలూగేఉడతల్లారానిలకడలేనినామదిలోనాతొణికిసలాడేఊహలుకారామొదటి దాని కన్నా రెండో దాంట్లో ఊపుంది కదా?అందంగా వచన కవిత్వం చెప్పడం అన్నిటి కన్నా కష్టం. ఒక రకంగా తిలక్ వచన కవిత్వాన్ని ప్రవేశపెట్టి తెలుగుసాహిత్యానికి తీరని ద్రోహం చేసేడేమో అనిపిస్తుంది అపుడపుడు. వచన కవిత్వాన్ని అందంగా రాయడం ఆయనొక్కడికే తెలుసు. కాని, ఆయన ప్రవేశ పెట్టిన ఒరవడిని అనుకరించి పప్పులో కాలేసిన వాళ్ళే ఎక్కువ.ఇక అసలు విషయానికొద్దాం. కవతకి భావం ప్రాణం అని ముందే చెప్పుకొన్నాం కదా. All poetry is metaphorical and allegorical. కవి గులబిమొక్కలాంటివాడు. ఎలాగైతే ఓ గుప్పెడు మట్టిని, గ్లాసుడు నీళ్ళనీ అందమైన గులబీపువ్వుగా రూపొందించడానికి మొక్క ఎంత మధన పడుతుందో అలాగే కవి కూడా బాహ్యప్రపంచంనుంచీ అందిన ప్రేరణని, అది తనలో రేపిన స్పందనని కవితగా మలచడానికి అంతే తపన పడతాడు. ఈ తపనని రసనిర్దేసం అని అందాం ప్రస్తుతానికి. రసావిష్కరణ చెయ్యడానికి కవికున్న ముఖ్యమైన సాధనం - మెటాఫర్.గత 1500 సంవత్సారాల తెలుగు కవిత్వ చరిత్రలో, పోయటిక్ మెటాఫర్ లో చాలా మార్పులూ, చేర్పులూ వచ్చేయి. ఈ కోణంలోంచి, తెలుగు కవిత్వాన్ని- వస్తు విషయ వర్ణన, భావ వ్యక్తీకరణ, అనుభూతి చిత్రీకరణ అని స్తూలంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.ఈ పద్దతుల గురించి విపులంగా - తరువాత చెప్తాను.

రెండో భాగం - వచ్చే వారం

అందాక, మీకిదే శిరోభారం

No comments: