Sunday, February 11, 2007
వాక్యం రసాత్మకం కావ్యం -- మూడో భాగం
తెలుగులో అనుభూతి కవిత్వంయొక్క (ఎల్లిగారికల్ పోయిట్రీ) స్వరూప స్వభావాలు.(ఇంతవరకూ, ప్రబంధ కవిత్వం గురించీ, భావ కవిత్వం గురించీ - వాటి మధ్య తేడాలను గురించీ, లక్షణాలను గురించీ చెప్పుకోన్నాం కదా. ఇంక, ఇక్కడ నుంచీ అంతా అనుభూతి కవిత్వం (అర్ధంకాని కవిత్వం అనే పర్యాయ పదం కూడా ఉంది దీనికి) స్వభావం గురించి, లక్షణాల గురించిన గొడవ.)వర్ణనని ప్రబంధ కవులూ, స్పందనని భావకవులూ తన్నుకు పోయేరు కాదా - మరింక అనుభూతికవికి చెప్పడానికేం మిగిలింది పాపం అనుకొంటున్నారా? నిజమే - చాలా కాలం ఏంచెప్పాలో తెలియక చాలా మంది కవులు పక్క దారులు తొక్కేరు. ఈ మధ్యనే, మనో వైజ్ఞానికశాస్త్రం అందుబాట్లోకొచ్చేక - ఆ స్పందన ఎక్కడ నుంచి పుడుతుందో, ఎలా పుడుతుందో, దాని స్వరూప స్వభావాలెట్టివో వెతికి, వెతికి, శోధించి ఏదో సాధించేద్దామని తెగ తాపత్రయపడిపోతున్నారు. అందుకే అనుభూతి కవిత్వాన్ని వంటబట్టించుకోవాలంటే కొంచెం కష్టపడాలి.మరి ఆ గొడవంతా సావధానంగా ఆలకించండి మరి:శేషేంద్రశర్మగారు - పాపం చాల రోజుల నుంచీ రామకృష్ణాబీచ్ లోనే ఉండి పోయేరు కదా? ఆయన్ని అక్కడ అంతకాలం ఉంచడానికి కారణం ఉందిలెండి - అనుభూతి కవితలు రాయడానికి చాలా టైం పడుతుంది మరి.తుమ్మెదకాటుకి కైపెక్కిపోయింది తిమ్మనగార్కి, తీయతేనియ బరువుతో కూలబడిపోయేరు కృష్ణశాస్త్రి. కాని అలాటి బాధలు శర్మగారి దరిచేరవు. వీళ్ళిద్దరూ ఎందుకిలా అయిపోయేరు అని ఆయన చాలసేపు ఆలోచిస్తాడు - ఈ కైపెందుకు కలుగుతోంది, ఆ బాధ ఎందుకింత తియ్యగా ఉంది అని కొన్ని రోజులు తపస్సు చేస్తాడు, ఆ తర్వాత:నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందికన్నుల్లొ నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చిందిఅని అందు కొంటాడు. ఏంటీ శేషేంద్రజాలం? తోట నిదురించటం ఏమిటి? తోటలోకి పాట రావటం ఏమిటి? ఇంతకీ ఎవరికి కన్నీళ్ళు - తోటకా? పాట కన్నిళ్ళు తుడవటమేమిటి? ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు మనం అడిగేలోపే, ఆయన ఇంకాస్తా ముందుకు జరిగి:రమ్యంగా కుటీరాన రంగవల్లుల్లల్లిందిదీనురాలి గూటిలోన దీపంగా నిలిచిందిఅంటాడు. ఇంతకీ తోట ఏమైనట్టూ? పాటేమైనట్టూ? అంతటితో ఊరుకోంటాడా?కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారానది దోచుకు పోతున్న నావను ఆపండీరేవు బావురు మంటుదోందని నావకు చెప్పండీఅని ముక్తాయిస్తాడు. నది నావను దోచుకుపోవడమేంటి? దాన్ని పక్షులూ మబ్బులూ ఎలా ఆపగలవు?దీన్ని మొదటిసారి చదివితే ఒక చరణానికి మరో చరణానికి ఉన్న సంబంధం ఏమిటో బోధపడదు. కవితలో మెటాఫర్ చాలా లోతుగా ఉంటుంది. కవిత మెత్తంఅంతా ఒక విషయం గురించి రాసినట్టుండదు. ఒకంతట అర్ధంమయి చావదు. కవిత్వం చదువుతున్నపుడు మీకు ఇలాంటి ప్రశ్నలే వస్తాయా? మరైతే వీటి రహస్యం చెపుతా వినండి. విన్న తర్వాత - ఛీ - ఇంత అందమైన పాటని ఇలా ఖునీ చేసెస్తావా అని నన్ను తిట్టకండి.అందానికి అర్ధంవెతక్కు అని మీకు ముందే వార్నింగిచ్చేను - మీరు వినలేదు. కావున - పొరబాటు నాది కాదు.ముత్యాలముగ్గు సినిమాలో ఈ పాట మీరందరూ వినే వుంటారు. కె.వి.మహాదేవన్ - కాదు కాదు - మహిమదేవన్ - ఈ కవతని అందమైన పాటగా కూర్చేడు. ఒక్కనిమిషం సుసీలమ్మ గొంతునీ, మధురమైన మహిమదేవన్ సంగీతాన్నీ మరిచిపోయి, ఈ పాటని కవితలా చదివి చూడండి.ఇది అసలు సిసలు పదహారణాల వచన కవిత. వార్తా పత్రికలో వార్తలాగ దీన్ని చదివేసుకోవచ్చు. ప్రతి చరణం పూర్తి పేరాగ్రాఫ్ లాగా, పూర్తి వాక్యంలాగా ఉంటుంది. మీకింకా మహిమ దేవన్ మత్తు వదిలినట్టులేదు కదూ. అయితే, ఇంకోసారి చదవండి:విశాఖపట్న, ఫిభ్రవరి - ౯: నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లొ నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. రమ్యంగా కుటీరాన రంగవల్లుల్లల్లింది, దీనురాలి గూటిలోన దీపంగా నిలిచింది. కొమ్మల్లో పక్షులని గగనంలో మబ్బులని, నది దోచుకు పోతున్న నావను ఆపమని, రేవు బావురు మంటుదోందని నావకు చెప్పమని శేషేంద్ర శర్మ గారు రామకృష్ణాబీచ్ నుంచి రిపోర్ట్ చేస్తున్నారు.అనుభూతి కవిత్వం అంతా దాదాపుగా ఇలాగే ఉంటుంది. ప్రబంధ కవులు తమ శక్తినంతా వర్ణించడంలోనూ, ఆ వర్ణనకి కావలిసిన భాష, పదాలు, ఛందస్సుకోసం కొత్త కొత్త సమాసాలు సృష్టించడంలోనూ కేంద్రీకరించేరు. భావకవులు మధురమైన ఊహలని మనకందించడానికి కొత్త కొత్త మెటాఫర్లు కనిపెట్టడంలో తమ శక్తినంతా కేంద్రీకరించేరు - కాబట్టి, భావకవిత్వానికొచ్చేసరికి - భాష తేలికయ్యి, భావం బరువైంది. అదే, అనుభూతివాదుల దగ్గరకొచ్చేసరికి - అర్ధగాంభీర్యం ఇంకా ఎక్కువైపోయి, భాష ఇంకా తేలికైపోయింది.ప్రబంధకవిత్వాన్ని అర్ధంచేసుకోడానికి భాషతో ఎంత కుస్తీలు పడాలో, అనుభూతికవితల లోతులందుకోడానికి అంతకన్నా అవస్తలు పడాలి - అందుకనేమో, చాలమంది భావకవిత్వానితో ఆగిపోతారు.శేషేంద్రశర్మ కవితనే తీసుకోండి - అందులో అర్ధం అందినట్టే ఉంటుంది కాని మనకి పూర్తిగా చిక్కదు. అందుకోడానికి మనమో అడుగు ముందుకేస్తే, అది మరో పదడుగులు పరిగెత్తి మనలని పరిహసిస్తూంటుంది.Allegory ని తెలుగులో ఎమనాలో నాకు తెలియదు. అనుభూతికవితలన్ని ఎల్లిగారికల్ గా ఉంటాయి. అయితే, నిజానికి వీటినర్ధంచేసుకోడం అంత కష్టమేమీ కాదు. సుమారుగా, మంచి అనుభూతి కవితలన్ని ఒక ప్రణాలిక ప్రకారం ఉంటాయి - అంటే, వీటన్నిటిలో ఒక స్ట్రక్చరుంటుందన్నమాట. అంతర్లినమైన, మానసికమైన, ఆథ్యాధ్మికమైన, ఆత్మపరమైన భావాలని ఒక భాహ్యచిత్రానికి అన్వయం చేసి, అంతఃచిత్రానికి భాహ్యచిత్రాన్ని ప్రతీకగా చూపడతాయన్నమాట. అంటే, మనలోపలి Sub-Conscious and Psychological Processes కి ఫొటోగ్రాఫ్ తియ్యడన్నమాట.నిదురించే .. పాట మీద ఓవంద పేజీల వ్యాఖ్యానం రాయొచ్చు. ఇక్కడ కొంచెం క్లుప్తంగానే చెప్తాను:ఈ పాటలో ప్రతి చరణంలో ఉన్న మొదటి పాదాలన్ని కలిపి చదివితే, ఒక అందమైన చిత్రపటం మన ముందుంటుంది. సుమారుగా, ప్రతి ఇంటిలోనూ, గోడలమీద స్వీట్-హోమ్ చిత్రాలుంటాయి గదా? దూరంగా కొండలు, కింద చక్కటి తోట, ఆ తోటలో చిన్న అందమైన కుటీరంలాంటి ఇల్లు, ఇంటికి పక్కగా - మెల్లగా, తీరికగా పారుతున్న నది, పైన పున్నమి చంద్రుడు, ఆ నదిలో తెరచాపెత్తిన నావ, పైనోరెండు పక్షులు, కొండలమీద మబ్బులు - ఇలాంటి ప్రకృతి పటాలెన్ని చూసుంటారు? ఈ చిత్రమంతా ఈ కవితలో ఉంది. అలాటి ఫొటో చూస్తే మనకెలాంటి ఫీలింగ్ కలుగుతుంది? ఏకాంతామూ, నిశ్శబ్ధమూ, నిశ్చలత కలగలసి - చీకులు చింతలూ, వ్యధలూ స్పర్ధలూ, ఆశలూ మోసాలూ లేని ఓ అందమైన సాయంత్రం గుర్తుకు రాదూ?ప్రతి చరణంలో, రెండో పాదంలో అంతర్లీనమైన మానసిక నిశ్చలతని మొదటిపాదంలోని చిత్రంతో అన్వయిస్తాడు. ఒక ఎరిక మనలో పుట్టి, తలుపుగా మారి, స్మృతిగా ఎదిగి, జ్ఞాపకంగా కరిగిపోయే ప్రక్రియని ( inner process) చిత్రీకరించే కవిత ఇది.నిదురించే తోట: మన సబ్-కాన్సష్. మెత్తం జీవితానుభవాన్నంతా ఒక గ్రంధాలయంలా బధ్రపరిచే బేంకు లాటిది సబ్-కాన్సష్. కాని ఇది మన కంట్రోల్లో ఉండదు. మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రేరణ, మన సుఖాలు, ధుఃఖాలు, బాధలూ, నవ్వులూ, ఇష్టాలూ, ప్రేమలూ, ప్రతీకారాలు - సమస్తం మన సబ్-కాన్సష్ అదుపాజ్ఞలలోనే ఉంటాయి. మనకోచ్చే కలలన్నీ దీని ప్రభావమే.మెదడు మొగుడైతే, ఇది పెళ్ళాం లాంటిదన్నమాట. సబ్-కాన్సష్ మాట మనం వినాలిగాని, మన నియంత్రణలో అదుండదు. అది చెప్పేదేదో తిన్నగా, సూటిగా, మనికర్ధమయ్యేటట్టు కూడా చెప్పదు. ఒకసారి క్రీగంట చూస్తుంది, సైగ చేస్తుంది - మనం వినిపించుకీకుండా తప్పుచేసిసేం అనుకోండి - చాలా ఆనందం దీనికి, నేను చెప్పేనా - నువ్వు విన్నావా, వినిపించుకొంటేనా అంటూ సరాగాలు పోతుంది. మరదేదో సరిగా సూటిగా చెప్పచ్చుకదా అని అన్నాం అనుకోండి - నన్ను పూర్తిగా ఎప్పుడైనా చెప్పనిస్తేనా, చెప్పేలోపే పరుగందుకొన్నావు కదా అంటూ దీర్ఘాలు తీస్తుంది.మెదడుకున్న శక్తితో పోలిస్తే, దీని శక్తి అపారం, అనంతం. మనం ఎన్నో విషయాలు మరచిపోతుంటాం - కనీసం అలా అనుకొంటాం, కాని, మన జీవితంలో ప్రతి క్షణాన్ని పదిలపరుస్తుంది మన సబ్-కాన్సష్. హేతుబధ్దమైన ఆలోచనల కందకుండా మనలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి, మీరో చీర కొనాలని చీరలకొట్టుకెళ్ళేరనుకోండి - అక్కడ కొన్ని వేల చీరలుంటాయిగదా - అందులో ఒక చీర మ్మిమ్మల్నాకర్షిస్తుంది - ఎందుకో చెప్పగలరా? అలగే, ఎదో లెక్కలు చేస్తున్నారునుకోండి - అది ఒక పట్టాన తేలి చావదు. దాని గురించే ఆలోచించి, తల బద్డ్దలు చేసుకొని, సమాధానం దొరక్క విసిగిపోయి పడుకొంటారు - తెల్లారి లేవగానే, అనుకోకుండా మీకు ఆ లెక్కకి సమాధానం దానంతటదే 'స్పురిస్తుంది' - ఎలాగో చెప్పగలరా? ఒకర్ని చూడగానే, ఎక్కడో చూసినట్టుంటుంది, ఆత్మీయుల్లా అనిపిస్తారు - ఎందుకో చెప్పగలరా? ఇదంతా సబ్-కాన్సష్ చలవే. మన మెదడుకి సంభందించినంతవరకూ ఇదో చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి.పాట: ఎదో ఒక అనుభవం, ఒక ఎరిక, ఒక స్పందన. సాధారణంగా మనల్ని కదిలించే అనుభూతులన్నీ - కొన్ని క్షణాల నిడివి మాత్రమే కలిగుంటాయి. 'అనుభూతిని' మిగిల్చే అనుభవం ఎప్పుడూ గంటలకోద్దీ ఉండదు. ఒక చెట్టునో పుట్టనో చూసినప్పుడూ, ప్రియమైన మనిషిని కలిసినప్పుడూ, మంచి పాట విన్నప్పుడూ, మనల్ని కదిలించే అనుభూతి రెప్పపాటు కాలం మాత్రమే కదా.కుటీరం: మన కందుబాటలో, మన నియంత్రణలో ఉండే మేధా శక్తి (కాన్సష్).రంగవల్లి: అనుభవంగా మారిన అనుభూతి. సాధారణంగా, మనం మనల్ని కదిలించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని, ఆ అనుభూతిని నెమరువేసుకొని, దానికి రంగులు పులిమి, రెక్కలు తొడిగి, ఒక చుట్టలా ఉన్న అనుభూతిని మన ముందు తివాచీలా పరచుకొంటుంటాం. దాన్ని, మన మిగతా అనుభవాలతో రంగరించి, జ్ఞపకాలతో ముడివేసి, ఆలోచనలతో మేళవించి ముగ్గుల్లల్లుతాం. We generate the momentum from the moment. మొదటి చరణంలో పాట రెండో చరణంలో రంగవల్లి అయింది.దీనురాలు: హృదయందీపం: మనలని కదిలించిన ప్రేరణని మనం అనుభవిస్తున్నప్పుడు మనలో జనించే ప్రతిస్పందన. అంటే, పాటని, రంగవల్లిగా మనం మారుస్తున్నప్పుడు మనలో కలిగే పీలింగన్నమాట. ఆనందమో, విషాదమో, మాధుర్యమో, లాలిత్యమో, కోపమో, భాదో - ఇలాంటి ప్రతిస్పందనలు మనలో కలుగుతాయి కదా. ఈ ప్రతిస్పందనలు దీనురాలైన హృదయానికే గాని, సబ్-కాన్సష్ కుండవు. అలాగే, ప్రతిస్పందనలు - స్పందన మనలో జనించినప్పుడు కలగవు, ఆ స్పంధనని మనం అనుభవిస్తున్నప్పుడు కలుగుతాయి. రెండో చరణంలో రంగవల్లి ఇప్పుడు దీపమయ్యింది.నది: జీవన స్రవంతి. జీవితం ఎప్పుడూ ఎక్కడా ఆగదు, నదిలా అన్ని తనలో ఇముడ్చుకొంటూ, సాగిపోతుంటుంది కదా. ఎవరో ఒక గ్రీకు తత్వవేత్త చెప్పినట్టు ఒకే నదిలో నువెప్పుడూ రెండుసార్లు స్నానం చెయ్యలేవు - ఎందుకంటే, మునకేసి లేచేటప్పటికి కొత్తనీరు వచ్చెస్తుంది కదా?నావ: ఇంతకు మునుపు దీపంగా మారిన పాట, కొంత కాలానికి ఒక స్మృతిగా మారి - కాల ప్రవాహంలో కలసిపోయి, మన జ్ఞాపకాల మరుగున పడి కనుమరుగై కొట్టుకుపోతుంది.పక్షులు, మబ్బులు: పాత స్మృతులని హఠాత్తుగా వెలికితీసే ప్రేరణలు.బావురుమన్న రేవు: నిస్సారమైన, మార్పులేని దైనందిన జీవితం.సబ్-కాన్సష్ లో జనించిన ఒక ఎరిక, అనుభవంగా, జ్ఞాపకంగా ఎదిగి, మన ఎదలో ప్రతిస్పందనలు రేపి, స్మృతిగా మారి, చివరికొక జ్ఞాపకంగా కరిగిపోయే ప్రక్రియనంతా ఈ పాటలో ఎల్లిగారికల్ గా - ఒక పాట, రంగవల్లిగా ఎదిగి, దీపంగా మారి, నావగా అదృశ్యం అవ్వడం అనే చిత్రంతో అన్వయించేడన్నమాట. ఈ మధ్యనే కల్హార బ్లాగరి స్వాతికుమారి రాసిన అంతర్వాహిని అనే కవిత కూడా సుమారుగా ఈ థీమ్ మీద రాసిన కవితే.పాట నావగా మారడమేమిటండీ - వింటున్నాంగదా అని మా చెవుల్లో పువ్వులు పెట్టెస్తున్నారు గాని అంటారా? ఏం ఎందుకు మారకూడదూ?గనుల్లొ బొగ్గురాళ్ళు, జలపాతాల్లొ నీటి ధారలు, విద్యుచ్చక్తిగా రూపొంది, మీ ఇంటి దీపాల్లో కాంతి పుంజాలుగా, చూరులపైన పంకాల్లో చలన శక్తిగా, మీ శకటాల్లో గమన శక్తిగా రూపొందటంలేదూ? అంతెందుకు? మీ కంప్యూటర్ తెరమీద కనిపిస్తున్న ఈ అక్షరాలు కూడా విద్యుత్తే కదా - అంటే, ఒకప్పుడు ఈ అక్షరాలు నీటి ధారలో, బొగ్గు ముక్కలో కావా? నల్లటి బొగ్గు అందమైన అక్షరం అయినప్పుడు - పాట నావెందుకు కాకుడదూ?పిండితే త ఫిలాసఫీ ఉంది ఈ పాటలో.అనుభూతి కవిత్వాన్ని పరిచయం చెయ్యడానికి మాత్రమే నేను ఈ పాటనెన్నుకొన్నాను. మంచి అనుభూతి కవితలన్ని సుమారుగా ఇలాగే ఉంటాయి. అయితే, చెత్త కవితలని కూడా, ఉదాహరణకి:మా ఆవిడ శిరోజాలకి శిశిరం వచ్చిందిఅందుకే, నిన్న రాత్రి నిద్దట్లో నేనుహేమంతాన్ని తినీశేనులాంటి కవిత్వాన్ని కూడా అనుభూతి కవిత్వంగా చెలామణీ చేసెస్తున్నారీమద్య. అర్ధంకానిదీ, అర్ధంలేనిదీ ఒకటి కాదు కదా? అర్ధంలేని కవిత్వాన్ని కుడా అనుభూతి కవిత్వమంటే ఏంచెయ్యగలం? చచ్చినవాడి కళ్ళు చేరడేసి అని ఊరుకోవాలంతే.మరైతే, ఈ అనుభూతికవిత్వాన్ని ఆశ్వాదించాలంటే సైకాలజీ అంతా తెలియాలా అని అడుగుతారేమో. నిజానికి, మంచి అనుభూతి కవిత్వాన్ని గుర్తించడం, ఆస్వాదించటమూ అంత కష్టమేమీ కాదు.ఆ విషయాలన్ని తరవాతి భాగంలో చెప్పుకొందాం. వీటిని చదవటం ఎలాగో, రాయటం ఎలాగో - నాకు తెలిసినంత వరకూ - తరువాతి భాగాలో వివరిస్తాను. నాలుగో భాగంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి కవితలనో మారు స్పృశించి, డైలాన్ థామస్ గురించీ చెప్పుకొని, అనుభూతి కవితల స్ట్రక్చర్ గురించి, మంచి కవితలనెలా గుర్తించాలో వివరిస్తాను. ఆ తర్వాత, వీటిని రాయడంలో నాకు తెలిసిన చిట్కాలు కొన్ని చెప్తాను.అనుభూతి కవిత్వం గురించి ఇంత విపులంగా ఎందుకు రాస్తున్నానంటే, ప్రబంధ కవిత్వం గురించి, భావ కవిత్వం గురించీ వివరించే వ్యాసాలూ, పుస్తకాలు చాలానే ఉన్నాయి. కాని, నాకు తెలిసినంతలో, అనుభూతి కవిత్వాన్ని నిర్వచించి, వివరించే ప్రయత్నం ఇంతవరకూ తెలుగులో ఇదే ప్రధమమేమో.మీ అభిప్రాయాలని నాకు తప్పకుండా తెలియ చెయ్యండి - ఈ వ్యాసాన్ని మెరుగుపరిచి, ఇందులో తప్పులేమైనా ఉంటే సరిదిద్దటానికి మీ సూచనలూ, అభిప్రాయాలూ నాకు చాలా విలువైనవి.
No comments:
Post a Comment