Saturday, April 28, 2007

వాక్యం రసాత్మకం కావ్యం లో నాలుగో భాగం


నాగరాజు పప్పు (వ్యాసకర్త)
గగనకుసుమాల గూడుపుఠాణి
February 14th, 2007 by Nagaraju Pappu
వాక్యం రసాత్మకం కావ్యం లో నాలుగో భాగం ఈ వ్యాసం కొంచెం పెద్దది. చదవటానికి సమయం పట్టొచ్చు. గగన కుసుమం వ్యాసం చదవని వారు ముందుగా అది చదివి, ఆ తర్వాత దీన్ని చదవమని మనవి. గగనకుసుమం చదివిన వాళ్ళు, అది చదివినప్పుడు మీలో రేగిన భావోద్రేకాలింకా మరచిపోక ముందే దీన్ని కూడా చదవమని మనవి. ఒకవేళ వారాంతంలో చదవదలుచుకొంటే, మళ్ళీ దాన్నొకసారి చదివి, ఆ తరువాత దీనిమీదకి రండి.
గగనకుసుమాలు వ్యాసం రాయటం వెనకాల చాల గూడుపుఠాణి ఉంది. నేనేదో కోపంతోనో, అలకతోనో చేసిన పని కాదది. పాపం మా వెంకట రమణుడు తన కలలో కూడా ఊహించని అర్ధాలు, అపార్ధాలు ఆయన చేసిన ఓ అమాయకమైన వ్యాఖ్యలోంచి లాగి, ఆయన్ని శిఖండిలా అడ్డుపెట్టుకొని అన్ని బాణాలు వెయ్యడం వెనుకో పరమార్ధం ఉంది. ఏంటంటే:
౧. నిదురించేపాట గురించీ, అనుభూతి కవిత్వం గురించి రాసిన వ్యాసం చాల ఇంటలెక్చువల్ గా ఉంది. సబ్-కాన్శష్ అని, కాన్శష్ అని, మేధ అని ఏవేవో పద జాలాలు ప్రయోగించ వలసి వచ్చింది. ఆ పాటని, ఆ వ్యాసంలో చెప్పిన ఇన్నర్ ప్రోసస్ ని మీకందరిరికీ స్వానుభవంలోకి తేవడానికి మీమీద నేనేసిన ఒక ప్రాక్టికల్ జోకు. ఇంక రెండోది, చాల మంది కవిత్వం అర్ధం కాదంటున్నారు. నిజానికీ మాట పచ్చి అబద్దం. మీ కందరికీ కవిత్వం చాలా బాగా అర్ధం అవుతుంది - ఆ సంగతి మీకు తెలియదంతే. అది నిరూపించడానికి చేసిన ప్రయేగం. కవిత్వం రాదు రాదు అనే మా వెంకట రమణ చేమకూర వెంకట కవిని మించిపోయే సటైరేసేడా లేదా? కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళందరికీ అందం, సౌందర్యం, కవిత్వం చాలా బాగా అర్ధం అవుతాయి. ఎందుకంటే, ప్రోగ్రామింగ్ అనేది - సృజనాత్మకమైన కళ, పైగా ఏబ్-స్ట్రాక్షనికి అది పరాకాష్ట. ప్రయత్నిస్తే మంచి ప్రోగ్రామర్లందరూ మంచి కవితలు రాయగలరు. Visualization and aesthetic experience are inherent in programming activity.
౨. కవిత్వంలో, సంగీతంలో నవ రసాలని గురించి చెప్తారు - వాటిని ఎలా ఉపయోగించాలో, వాటి స్వరూప స్వభావాలెట్టివో ఎలా చెప్పడం? రౌద్రం అంటే కోపం అన్నాం అనుకోండి - అదో పర్యాయ పదం - అంతే. ఆ రసాన్ని ఎలా ప్రయోగించాలో ఎలా చెప్పడం? అందుకని, ఒక సారి మీ చేత ఆ రసాలన్ని తాగించేస్తే, అప్పుడు చాల సుళువుగా - అమ్మాయీ - మొదటి పేరాలో నువ్వు తాగింది భీభత్సం అని ఒక మాట చెప్పెస్తే చాలు కదా?
౩. ఈ వ్యాసాలు మొదలెట్టేట్టప్పుడు - నాకు తెలిసినంతలో ఈ రాయటంలోని చిట్కాలు చెప్తానని ప్రతిన బూనేను కదా? రసనిర్ధేశం ఎలా చెయ్యాలో ఎలా చెప్పడం? అందికని ఈ ఎత్తు ఎత్తేను.
శ్రీ శ్రీ - కవిత్వం ఎలా రాయాలో చెపుతూ:ఉండాలోయ్ భావావేశంకానీవోయ్ రసనిర్ధేశంకళ్ళంటూ ఉంటే చూసివాక్కుంటే వ్రాసీఅంటాడు కదా?
అంటే, కవితలు రాయటానికి నాలుగు స్టెప్పులున్నాయి. మొదటిది - భావావేశం. రెండోది - రసనిర్ధేశం. అంటే, భావావేశాన్ని రసనిర్ధేశంగా మార్చాలి, ఆ తర్వాతే, చూడడం (సౌందర్య దర్శనం), చివరగా వాక్కులు ఎంచుకోవడం. సాధారణంగా, మనం, భావావేశం లోంచి, వాక్కులోకి డైరెక్టుగా దూకేస్తాం. అయితే, భావావేశాన్ని - రసనిర్ధేశం గా ఎలా మర్చడం? ఎలా మార్చాలో ఎలా చెప్పడం?
అది మీకనుభవంలోకి తేవడానికే - ఈ గగన కుసుమాలని మీమీద ఒదిలింది. ఆ గూడుపుఠాణి అంతా, ఇదిగో కింద వివరంగా విపులీకరించేను. నిన్న రాసిన గగనకుసుమాలలో, ప్రతి పేరా వెనుక ఉన్న రసనిర్ధేశాన్ని, అది మీ సబ్-కాన్షష్ లో రేపిన భావోద్రేకాలని - ఒక్కక్కరిలో కలిగిన స్పందలనీ, అవి ఎక్కడ నుంచీ, ఎలా వచ్చేదీ - చెప్పడానికీ ప్రయత్నం:
౧. నిజానికి నేనెవర్నీ మందలించలేదు. మీరు మెదటి రెండు పేరాలు వదిలేసి చదివితే, నిజానికిది చాలా తటస్తమైన వ్యాసం నేను తిట్టిందల్లా - కాగజ్-కే-ఫూల్ కపిరాజుని, ఆయన గారి కిచ కిచల కవిత్వాన్ని, ఆయన చుట్టూ చేరిన బాకాసుర భట్రాజులని మాత్రమే.౨. ఈ కింద నేనిచ్చిన వివరణ మూడు రకాలుగా ఉంటుంది: ౧. ప్రతి పేరాలో నేనుద్దేశించిన భావావేశం ఎమిటో, దానికి రసనిర్ధేశం ఎలా చెయ్యడం అయిందో చెప్పడం ౨. మీలో ఉన్నదే మీకర్ధం అవుతుంది అన్నాను కదా? అది ఎలా జరుగుతుందో వివరించటం. ౩. మన సబ్-కాన్షస్ (నిదురించే తోట) పవరేంటో, అది మనతో చేసే మాయేంటో వివరించటం
————————-మాకు కవిత్వం అర్ధం కాదని అందరూ అంటూంటే - అందులోనూ నీ కవిత్వం అస్సలర్ధం కాదని అంటే - పోనీలే పాపం - అని నేనెంతో శ్రమకోర్చి వివరంగా చెప్పడానికి పూనుకొంటే ఇన్ని విసుర్లా? ఇన్ని సెటైర్లా? రసగుల్లాలా నోటికందిస్తూంటే - ఇనుప గుండులా గొంతుకడ్డం పడుతోందా - మరీ చోద్యం కాకపోతే? ముప్పై సార్లు చదివినా అర్ధం కాదా? మీకర్ధం కావాలంటే మీ షష్టిపూర్తి దాకా నేనాగాలా? అప్పటిదాకా నేనుండకపొతే ఏం చేస్తారు - నా ఫొటేకేస్తారా పొగడ దండలు? నా రాతలన్ని రిటైరనవాళ్ళకే గాని మీ లాంటి పడచు వాళ్ళకి పనికి రావనే కదా ఇందులో సటైరు? వినేవాడికి చెప్పేవాడు ఎంత లోకువైతే మాత్రం - దడిగాడు వానసిరా అని అంత డైరెక్టుగా అనేస్తారా? ఇంత సెటైరా? ఏం - చామకూర వెంకటకవిని మీరొక్కరే ఔపోసన పట్టేరని అహంకారామా? మా దగ్గరా ఉన్నాయండీ శ్లేషలూ, సెటైర్లూ, సమ్మోహనాస్త్రాలూనూ.
[వివరణ]౧. మీరు గమనిస్తే ఈ పేరాలో వాక్యాలన్ని ప్రశ్నార్ధకాలు, దీర్ఘాలుతో ఉంటాయి. నాకేదో బాగా కోపం వచ్చిందని మీకు వెంటనే స్పురిస్తుంది. అదే దీర్ఘాలు, ప్రశ్నార్ధకాలూ తీసేసామనుకోండి - దీని భావం మారి పోతుంది. ఉదాహరణకి - "నేనింత కష్టపడి రాస్తే - వెంకట రమణగారు అర్ధం కాలేదన్నారు. అన్నారు కాని, ఎందుకర్ధం కాలేదో చెప్పలేదు. ఎప్పటికీ అర్ధం కాదన్నారు, అది నన్ను చాలా బాధించింది" - అన్నాం అనుకోండి - ఎలా ఉంది?
౨. ఇందులో - ఆక్రోశం అనే భావావేశాన్ని, రౌద్రంగా మార్చడానికి ఉపయేగించిన పద్దతి:సాగదీసినట్టుగా మాట్లాడడం, ప్రశ్నార్ధకాలతో - ఆపకుండా దండకంలా రొదపెట్టట్టంఅహంకారం, అస్త్రం అనే మాటలు ప్రయోగించడం
౩. ఇది చదవగానే - మీ మది లో ఎటువంటి స్పందనలు మెరుపుల్లా మెరిసేయి? మీకు ఎందుకు నాకేదో చాలా కోపం వచ్చేసిందనే భావం కలిగింది? మీరు, మీ జివితంలో బాగా కోపం వచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడతోరో ఇంతకు మునుపే అనుభవించేరు. కోపం వచ్చిన వాడు, ఆపుకోకుండా, గుక్క తిప్పుకోకుండా ఏఏదో అంటాడు. తీవ్రమైన పదజాలాన్ని ప్రయోగిస్తాడు. తనని తను నిందించుకొంటాడు. ఈ విషయాలన్ని మీకు (మీలో నిదురించే తోటకి) బాగా తెలుసు. అంటే, మీలో ఉన్నదే మీకర్ధం అవుతోంది. అవునా?
౪. ఈ పేరా మీరు చదువుతున్నా,మీ నిదురించే తోట మీకు తెలియ కుండానే మిమ్మల్ని జరగబోయేదానికి సిద్దం చేసేస్తోంది. అంటే, రౌద్రం అనే ‘పాటని’ ప్రశ్నార్దకాలుపయోగించి, దండకం చదివీ, మీ నిదురించే తోటలోకి ప్రవేశ పెట్టేనన్నమాట. చదువుతున్న మీకంటే - అంటే - హేతు బద్దమైన మీ బుద్ధికంటే ముందే - మీ నిదురించే తోట ఎప్పుడూ ముందుంటుంది.
౫. మీలో కలిగిన భావావేశాలెట్టివి? అది కూడా మీ వ్యక్తిత్వం మీద ఆధార పడి ఉంటుంది. మీలో సున్నిత మనస్కులు - అయ్యో పాపం ఈయన చాలా భాద పడినట్టున్నారు అని ‘ఫీల్’ అయ్యుంటారు. "నా ఫొటోకేస్తారా దండలు" అన్న వాక్యం కొంతమందిని ఊపేసుంటుంది. వెంకట రమణుడైతే పాపం కళ్ళంట నీళ్ళు పెట్టుకొన్నాడేమో! పిరికి వాళ్ళు - ఇంక ఈయన మనల్ని తిడతాడు కాబోలని భయపడుంటారు. మానసికంగా బాగా పరిపక్వత చెందిన వాళ్ళు, నాకు కోపం వచ్చిందని గుర్తించినా, తటస్తంగా ఉండగలుగుతారు. మీలో కొంత మంది సర్వజ్ఞ సింగభూపాలురెవరైనా ఉంటే - వీడేదో సొంత డబ్బా కొట్టుకొంటున్నాడు అని అనుకొంటారు. ఈ సర్వజ్ఞులకి ఎవరైనా సొంత డబ్బా కొట్టుకుంటుంటే చాలా ఏవగింపు, అందులో సరుకున్నా దాన్ని వీళ్ళు మెచ్చుకోలేరు.
౬. అయితే, ఈ భావాలన్ని మీలో చటుక్కున మెరసి మాయమైపోతాయి - నాకు కోపం వచ్చిందని గుర్తించినా, మీకేమవుతోందో ఇంకా మీరు (అంటే ఈ పేరా చదివేట్టప్పటికి) గుర్తించలేరు.
౭. ఇంక ముఖ్యమైన విషయం - ప్రశ్నార్ధకాల ద్వారా - ఈ వ్యాసం వ్యక్తిగతమైపోయింది. It became an issue between you and me, it became personal. అందుచేత, మీరెంత ప్రయత్నించినా, తటస్తంగా చదవలేరు. మిమ్మల్నే ఉద్దేశించినట్టు అనుకొంటారు. ఇది కూడా మీ నిదురించే తోట ప్రభావమే. మిగతా వ్యాసం అంతటినీ మీకు అన్వయం చేసుకొంటూ ఉంటారన్నమాట.
——————–ఇదిగో - మచ్చుకొకటి - మరి కాచుకోండి.[వివరణ]ఇది రస నిర్ధేశం చేసే వాక్యం.౧. నేను నీ చెంప వాయిస్తాను అని నేనంటాను. ఆ తర్వాత నేను అలా చెయ్యక పోయినా, చేసినట్టు మీకనిపిస్తుంది. అంటే, కోపం అనే రసం మీ నిదురించే తోట తాగింది. ఇక్కడ కూడా, మీ మీ వ్యక్తిత్వాలకనుగుణంగా - ప్రతి స్పందన ఉంటుంది. సర్వజ్ఞులైతే - మచ్చుకొకటి అన్న పదం చూడగానే - వీడేడో పెద్ద తిక్కన లాగా ఫోజులిచ్చెస్తునాడు అనుకొంటారు. అంటే, వాళ్ళకి తెలియ కుండానే, అలాటి ఫీలింగ్ వాళ్ళలో స్తిరపడిపోతుంది.౨. ఇక్కడతో, ఇంక మీ నిదురించే తోట మీతో మాయలు చేయడం ప్రారంభిస్తుంది. ఇక మిగిలిందల్లా మీతో రంగవల్లుల్లల్లించడమూ, మీ గూటిలో ఎమోషన్లనే దీపాలు వెలిగించటమూను. చివర్లో మీచేత బావురుమనిపించటమూను.—————————-కవిత్వం అర్ధం కావాలంటే - అందం అర్ధం కావాలి. అందం అర్ధం కావాలంటే, ప్రపంచం అర్ధం కావాలి. ప్రపంచం అర్ధం కావాలంటే ముందు మనకి మనం అర్ధం కావాలి. మనకి మనం అర్ధం కావాలంటే, మనలొకి మనం తొంగి చూసుకోవాలి - దానికో ఆత్రుత కావాలి, ఆవేశం కావాలి, ధ్యేయం కావాలి, ధ్యానం కావాలి. కాని, ఇప్పుడందరూ ‘అర్ధా’ర్దులే కాని విద్యార్ధులు కారుగా? ఇదీ అసలు సమస్య. భూమి కూడా తన సహజమైన సహనం కోల్పోయి, రియల్-టైమ్ లో తన చుట్టూ తను తిరిగేస్తోంది కదా, కాల మహిమ వల్ల. అందుచేత, మనకి రోజుకి చదవడానికి ముప్పై బ్లాగులున్నాయ్, నెత్తిమీద కూచున్న బాసులున్నాయ్, ఇంటికొస్తే చంకనెక్కే పిల్లలున్నాయ్, లేనివారికి పిల్లులున్నాయ్, తీర్చడానికి అప్పులున్నాయ్, తిరగడానికి కార్లున్నాయ్, తినడానికి ‘మాల్స్’న్నాయ్, చూడడానికి రామోజి ఫిల్మ్-సిటిలో వాడిపోయి, రాలిపోయి, పాలిపోయి, పాచిపట్టిన ‘సుమా’లున్నాయ్. మన దగ్గర లేనిదొక్కటే - మనకి మనం లేం, లోపల డొల్లలైపోయిన మనకి మిగిలిన అస్తిత్వం మన ముందు పరచుకొన్న మన నీడలు, మన వెనుక పెరిగిన అప్పులు, కాకపోతే మనం పెంచిన బేంకు ఖాతాల చిట్టా పద్దులు.
[వివరణ]కోపం రచయితగా నాకొస్తే ఏం ప్రయోజనం? మీకు రావాలి - దాన్ని మీరనుభవించాలి. అంటే, నా కోపాన్ని మీమీద నేను రుద్దాలి. అందుకని, మీ దగ్గరేదో లేదని నేననాలి. నేను, ఎవర్నీ ఉద్దేశించి ఏమీ అనక పోయినా, అలా అనుకొనేటట్టు మిమ్మల్ని ముందే సిధ్దం చేసేను కాబట్టి, నే నేమన్నా మిమ్మల్ని అన్నట్టే మీరు ‘ఫీల్’ అవటం ప్రారంభిస్తారు. ఇందులో మీచేత తాగించిన రసం - నింద. నిందనుపయోగించి, నా కోపాన్ని, మీ మీద రుద్దడానికి రంగం సిద్దం అయ్యింది ఇక్కడతో.
బాణాలేస్తానని ముందే చెప్పేను కదా. ఆ బాణాలన్ని మీకు తగలడం ఇక్కడతో ప్రారంభం అవుతుంది. ప్రతి వాక్యంలోనూ - చివర ‘ఇ’ కారాన్ని వదిలెయ్యడం వల్ల, అవి బాణాల్లా మీ కనిపిస్తుంది. అప్పులున్నాయ్ అని కాకుండా - అప్పులున్నాయి (ఇకారాంతంతో సహా)- ఇలా అన్నాం అనుకోండి - అప్పుడా వాక్యాలు బాణాల్లా ఉండవు, చప్పగా పేల పిండి ఒడియాల్లా ఉంటాయి. ‘య్’ ప్రయోగంతో జోరు, వేగం వస్తాయి. సర్ర్ సర్ర్ మని మీకు తగలడం ప్రారంభం. ఇక్కడితో మీ నిదురించే తోట, మీ మేధశ్సుతో అనుసంధానం అవుతుంది - ఇక్కడ నుంచి, ఇంక రంగవల్లుల్లూ, ఆవేశ కావేషాలూ మొదలువుతాయి.———————-అంతమాత్రం చేత, ప్రయత్నం చెయ్యాలికాని, పిక్చరు పోస్టుకార్డు వెనక రాసుకొనే కాప్షన్లనే కవితలుగా చలామణీ చెయ్యడానికి అనుమతించెస్తారా? చక్కటి కవిత రాసిన వాళ్ళుకూడా - కనీసం రాసే సామర్ధ్యం ఉన్న వాళ్ళు కూడా - బద్దకించేసి - అరక్షణంలో పాఠకులకర్ధం అయిపోవాలని - తాము రాసిన కవిత ముందొక చిత్రపటం అతికించవలసి వస్తోంది. దానికి మీ భాద్యత లేదా? కవితల ముందు ఫొటో అతికించాల్సిన దౌర్భగ్యం మీద నా అభిప్రాయం మాటెలా ఉన్నా, ఆంధ్ర కవితా పితామహుడే బతికుంటే - కన్నిరు మున్నిరుగా విలపించేవాడు కాదా? దమ్మున్నవాడు కాబట్టి - మనుచరిత్రలో, ప్రవరాఖ్యుని వర్ణిస్తూ, ‘అలేఖ్య తనూ విలాసుండై’ అని ఆయన ఒక ఆటంబాంబు విసిరేడు. ఆంటే, ఏ చిత్రకారుడు గీయలేని అందాన్ని తన కవిత్వంలో ఆవిష్కరిస్తానని సపధం చేసేడన్నమాట. ఆ ఒక్కమాటతో, షోడస కళలన్నిటిలోకి కవిత్వానికి పెద్దపీఠ వేసి, పేరు సార్ధకం చేసుకొన్నాడు.
[వివరణ]ఇందులో మొదటి రెండు లైన్లు చిదివినప్పుడు మీకెవరు గుర్తుకోచ్చేరు? చాలమంది తెలుగు బ్లాగర్లకి రాధిక గుర్తుకొచ్చుంటుంది. కాని, నేనావిడ పేరైనా ఎత్తలేదే? ఇంక రాధిక అంటే మీ కందరికీ ఎలాంటి అభిప్రాయం ఉంది? సున్నితమైన మనస్కురాలు, చిన్నపిల్ల, చాలా మంచిది - ఇలాంటి అభిప్రాయమేనా? కాని మీరేప్పుడూ ఆవిడని చూడలేదే? ఆవిడ మనసు నవనీతమని మీకెలా తెలుసు? ఆవిడ ఆడో, మగో కూడా నిజానికెవరికీ తెలియదు, ఆవిడ వయస్సెంతో తెలియదు. అయినా, అందరికీ అదే అభిప్రాయం.ఇదీ మీ నిదురించే తోట పవరు. ఇంత ఊహా శక్తి ఉన్న మీరు కవిత్వం అర్ధం కాదని ఏ గొంతుతో అనగలరు సార్?
ఇది చదువుతున్నప్పుడు మీ భావోద్రేకాలెలా ఉంటాయి? కొందరికి, రాధిక గుర్తొచ్చి మనసు చివిక్కుమనుంటుంది. కొంతమందకి నా మీద పీకల దాకా కోపం వచ్చుంటుంది. ఈయనేంటి - ఈ అమాయకురాలి మీద పడ్డాడు, ఇంకెవరూ దొరకలేదా ఈయనకి అని.చూసేరా - ముందు కలిగిన కోపం, నింద అనే రసాలు తాగిన మీ నిదురించే తోట మీతో ఎన్ని రంగవల్లుల్లల్లించిందో? ఈ ముగ్గులన్ని మీకు మీరు పెట్టుకొన్నవే. ఇందులో నా ప్రమేయమేమీ లేదు. ఇక్కడ మీలో కలిగిన ఎమోషన్లన్ని - మీలో వెలిగిన దీపాలు. కోపం, తాపం, బాధ, ఉక్రోషం - ఇలాటివన్నీ.
ఈ పేరా రాయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కోపం, రౌద్రం, బాధ లాంటి భావాలు కదా - శృతి మించితే చాలా చిక్కులొస్తాయ్ మరి. మీ భావోద్రేకాలనదుపులో ఉంచడానికి, అల్లసాని పెద్దనగారిని అడ్డు పెట్టుకోవలసి వచ్చింది.————————————-
కాని, మన భాగ్యం కొద్దీ మనికీ మద్యనో వాగ్గేయకారుడవతరించేడు కదా? రంపపు కోతల పద కపిత్వాన్ని పరా పరా తనే రాసేసి, కుప్పిగెంతుల నాటకాలు తనే ఆడేసి, కూని రాగాల సంగీతం తనే కూర్చేసి, చతుర్ధశ భువనాలల్లోనూ వినిపించేటట్టు ప్రచార సాధనాలతో బాకా ఊదేస్తున్నాడు కదా? స్వర్గంలో ఉన్నా, కవితా పితా మహునికీ, పదకవితా పితా మహునికీ ఈ కారు కూతలు వినబడే ఉంటాయి, వినలేక - "హరి హరి" అంటూ - పండులాంటి ఆ పెద్దలిద్దరూ స్వర్గంలో కూడా హరీమనుంటారు. కాదంటారా?
[వివరణ]ఇక్కడ నుంచి, హాస్యాన్ని ప్రవేశ పెట్టి, రూటు మార్చే ప్రయత్నం. మనకి నచ్చిన వాళ్ళని తిడితే ఎంత కోపం వస్తుందో, మనకి నచ్చని వాళ్లని తిడితే - ఐస్క్రీం తిన్నట్టుంటుంది కదా. మీద పేరాలో బుంగమూతి పెట్టిన మీ అందర్నీ - గిలిగింత పెట్టడానికి ఈ ప్రయేగం. మీ బుజ్జిగాడు అలిగేడనుకోండి - అప్పుడు మీరు వాడికి కితకితలు పెడితే - వాడి కోపం పోదు, కాని ఓ కంట నవ్వుతూ ఉంటాడు. మెల్ల మెల్లగా దిగొస్తాడు.———————–
అందుకే, మన చెవులకి పట్టిన ఈ తుప్పు ఒదలగొడాదమనే నేనీ వ్యాసాలు మెదలుపెట్టేను. మెల్ల మెల్లగా మిమ్మల్ని, కవిత్వంలోంచి, ఎల్లలెరుగని ఆనంద సాగరం - మన కర్ణాట సంగీత సామ్రాజ్యంలోకి, త్యాగరాజ విభావరీ మాధుర్యంలోకి తీసికెళాదమనుకొన్నాను. ఇంకా మెదలెట్టక ముందే మీరిలా చతికిల పడిపోతే ఎలాగండీ? లేవండి, లేవండి…
ఇంక ఈ అర్ధం కావడం అనే గొడవ గురించి ఓ రెండు ముక్కలు.
కాల చక్రాన్ని ఒక రెండు దశాబ్దాలు వెనక్కి తిప్పితే…[వివరణ]ఇది కూడా రసనిర్ధేశం చేసే వాక్యమే.—————–షెల్లీ రాసిన ఒజ్-మాండియాస్ కవితని గురించి చెప్పడానికి మా నాన్నగారికి పది గంటలు పట్టేది. ఇంగ్లీషులో సానెట్ అనే కవితా ఛందస్సులోని అందాలన్ని వివరించటానికి రెండుగంటలు, ఆ తర్వాత ఆ కవితలో ఒక్కో పాదాన్నిగూర్చి చెప్పడానికి కనీసం ఒక అరగంట. ఆంగ్ల సాహిత్యాన్నంతా చుట్టబెట్టి, మహాప్రస్తానంలోకి అడుగుపెట్టి, చివరగా, రాజులే పోయినా, రాజ్యాలు పోయినా, మనుషులే మారినా, మట్టిపాల్జేసినా, నిత్యమై, సత్యమై, నీవునా హృదాయన నిలచియుందువు చెలీ అనే ఘంటసాల పాట దగ్గర ఆపేవాడాయన. చెప్పడానికి, ఆయనకి పదిగంటలు పడితే, దాన్ని జీర్నించుకోడానికి మాకు ఒక సంవత్సరం పట్టేది.[వివరణ]సర్వజ్ఞులందరికీ మరీ సొంత డబ్బాగాడు అనుకొని, ఇక్కడతో చదవటం ఆపేసుంటారు…సాహితీ ప్రియులందరూ .. పాఠం వినడానికి నోటుపుస్తాకాలు, పెన్నులు తీసి చెవులు రిక్కపొడుచుకొనుంటారు.——————-రామాయణంలో, సీతమ్మని రామయ్య చేతిలో పెడుతూ జనకుడు చెప్పిన శ్లోకం "ఇయం సీతా, మమః సుతా.." దగ్గర, మా తాతయ్య పదిరోజులాగిపోయేవారు. ఆ శ్లోకం అనే పంచకల్యాణిమీద నన్ను కూర్చోపెట్టి, ఈశోపనిషత్తు దగ్గరనుంచి, ఉపదేశసారం దాకా తాత్విక ప్రపంచాన్నంతా తిప్పి తీసుకొచ్చేవారాయన. నేను, అమాయకంగా, అసహనంగా, "తాతయ్యా - ఒక్క శ్లోకానికే పది రోజులు పడితే, మరి రామాయణం ఎంతా ఎప్పటికయ్యేను?" అని అడిగితే, తన ఐదు వేళ్ళటోను నా కడుపోసారి నొక్కి, "అబ్బీ, అమ్మ పెట్టిన బువ్వ పట్టడానికే నీ పొట్ట చాలదు కదరా, రామాయణం అంతా మింగేస్తావా? ఒక శ్లోకం చాలదుటోయ్? అయినా, జీవితం అంతా నీ ముందుందిలే, తొందర దేనికీ. కానీ, ఇప్పుడు మన ముందున్నది మాత్రం ఈ క్షణం మాత్రమే, ఇప్పటికిలా కానీ" అంటూ, బలవంతంగానే ముందుకి కదిలేవాడాయన. రామేశ్వరం అనే సమాసానికి మూడర్ధాలు చెప్పడానికి రెండుగంటలు పట్టేదాయనకి మరి, రామాయణం అంతా ఒక్కరోజులో ఎల చెప్పగలడు పాపం?
[వివరణ]ఇక్కడ, సీత, రాముడు అనకుండా, సీతమ్మ, రామయ్య అనడం వల్లా, అమ్మ పెట్టిన బువ్వ, చిన్న పిల్లాడితో తాతయ్య సరసం, ఇవన్ని మీలో అత్మీయతా భావాలని మేలుకొలుపుతాయి. నా మీద, మీమీద కోపం పోయింటుంది ఈ పాటికి - ఎందుకంటే ఇక్కడ నేను చిన్న పిల్లవాడినైపోయేనుగా? కొంత మంది సున్నిత మనస్కుకలకైతే, ఈ తీయ తేనియ బరువుతో గుండె బరువెక్కిపోయుండాలి.ఇందులో, కానీ, కానీ అని వాక్యం మెదట్లోనూ, చివర్లోనూ వాడటం - చిన్న చమత్కారం.———————
ఇంతకీ, ఇదెందుకు చెప్పాల్సివచ్చిందంటే, అరక్షణంలో అర్ధమయిపోయేదాన్ని కవితగా చెప్పడం ఎందుకు? మంచి కవితలని ఆశ్వాదించటానికి సమయం పడుతుంది. ఏ కాలంలోనూ, మంచి పద్యంకాని, మంచి గేయంగాని, మంచి కవిత గాని - మన గుండెకి గాలం వేసి మనల్ని ఒక ఊపు ఊపాలి, అందులో ఉన్న చమత్కారాలని, అలంకారాలనీ, అందాలనీ, అర్దాలనీ అందుకోమంటూ మనల్ని ఊరించాలి. కొద్ది కొద్దిగా, మెల్ల మెల్లగా మనకి చేరువ కావాలి. కాష్మీరీ తివాచీలా చూస్తూన్నకొద్దీ అందులో చిత్రాలు, విచిత్రాలు, దాగున్న భావాలు మనకి కనిపించాలి. అందుకోసం మనం దానితో కొన్నాళ్ళు సంసారం చెయ్యాలి. అందరూ, కవిత్వాన్ని అలాగే ఆశ్వాదించేవారు. ఇంతకు ముందు, ఒక సాయంత్రం అంతా పది మందీ చేరి, తమకి తోచిన, స్పురించిన అర్దాలన్ని కధలుగా చెప్పుకొనే వారు. మనం అందుకోలేని భావాలున్నపుడే అది మంచి కవిత్వం అవుతుంది. అందుకోడానికి మనం చేసే ప్రయత్నంలోనే అసలు మజా అంతా. అప్పటకీ, ఇప్పటకీ కవిత్వాన్ని ఆశ్వాదించటానికి ఇదొక్కటే దారి. సూచనలు చెయ్యొచ్చు, చిట్కాలు చెప్పొచ్చు, ఉత్తేజ పరచొచ్చు, ఉత్సాహం పంచొచ్చు - అంతవరకే ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా.
అయితే, అర్ధం అనే పదానికి - సంపాదన అనే అర్ధం కూడా ఉంది కదా? నీ దగ్గరున్నదేకదా నీ సంపాదన? మీ దగ్గరేముందో, ఎంతుందో - అదే మీకర్దం అవుతుంది. ఎంత మహాకవైనా మీ ముందుంచేది ఒక కంకాళాన్ని మాత్రమే. మీ జీవిత సారమంతా అందులో పోస్తే, అప్పుడా కవిత, రక్తమాంసాదులు సంతరించుకొని, మూడునెలల పాపాయిలా మీ ఒళ్ళోకొస్తుంది, బోసినోటి చిరునవ్వులు చిందిస్తుంది, మీ గుండెలమీద తంతుంది, మీ ఒళ్ళు తడుపుతుంది. అప్పడుకూడా దానిది మూగ భాషే! అయితే, పాపాయినెత్తుకొన్న ఏ తల్లినైనా అడగండి - ఆ మూగభాష మన మాటల భాష కన్నా ఎంత సుందరమైనదో? ఆ భాష నర్దం చేసుకోడానికి ఆ తల్లి పడే కష్టాలేమిటో, అర్ధం అయిన తర్వాత ఆమెనుభవించే ఆనందం ఎలాటిదో. ఆ పాపాయిని మీరు పెంచి పెద్ద చేస్తే, పెరిగి మీ కళ్ళముందే కళ కళలాడే మీ కన్నకూతురవుతుంది. చక్కటి కవితా సుందరి మీ సొంత కూతురు కావాలంటే - పది సంవత్సరాలైనా పట్టొచ్చు, అదే పాతికైతే - సత్యం, శివం, సుందరం. కవిత్వం, సాహిత్యం అశ్వాదించాలంటే, ఒక్క సారైనా మీరు ప్రేమలో పడాలి (నేనిక్కడ, పదహారేళ్ళ అమ్మాయిలూ, పద్దెనిమెదేళ్ళ గడుగ్గాయిల సినిమా వలపుల గురించి చెప్పటంలేదు), పడితే సరిపోదు - అందులో ఎదగాలి. ఎదిగితే సరిపోదు - ఆ ప్రేమ పండాలి. అలా పండితే, మన మెధస్సుకి కనిపించే ప్రపంచం ఎంత ఇరుకో, నిండా ఎంత మురికో ఎరికలోకొస్తుంది. అప్పుడు సాక్షాత్కరిస్తుంది - సౌందర్యలహరి. సారీ సార్ - నాకు తెలిసి వేరే దారి లేదు.
[వివరణ]ఆత్మీయత, స్నేహంలోంచీ మిమ్మల్ని, కరుణ, ప్రేమ అనే రసాల్లోకి లాగే ప్రయత్నం. ఇక్కడ, అమ్మని ప్రవేశపెట్టి, ఆ అమ్మకో పాపాయినిచ్చి, ఆ పాప చేత నాటకాలాడించి, మీలో కరుణ, మాధుర్యం అనే భావాలని తట్టి లేపే ప్రయత్నం. ఇందాక మీ ముందు ఏడుస్తూ మెదలిన రాధిక - ఇక్కడ మీకు మళ్ళా మీ ముద్దుల చెల్లెలిగా కనిపిస్తుంది. ఇందులో చివర్లో, సున్నితమైన శృంగార రసం కూడా ఉంది. అవునా?
———————–ఈ పెద్ద కథలో ఓ పిట్టకథ:
బ్రోచేవారెవరురా కృతిని రచించిన వారు మైసూరు వరదరాజాచార్. ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మి ఆ కృతిని సర్వాంగ సుందరంగా తిర్చి దిద్ది ఆయన ముందోసారి పాడితే, కళ్ళంట నీళ్ళు పెట్టుకొని ఆయన - "అమ్మా - పేదింటిలో పుట్టిన కూతురు కలవారి కోడలై సర్వాభరణాలతోను పండక్కి పుట్టింటికొచ్చినట్టుంది తల్లీ నీ నోట నా పాట వింటుంటే" అని కదలిపోయేడు. అదీ, కవిత్వంతో ఉండాల్సిన సంబంధం.
[వివరణ]శ్రీరామ్ గారు, ఇది మహారాజ పురం విశ్వనాధయ్యర్ తో అన్న మాట అని సవరణ ఇచ్చేరు. ఆ సంగతి నాకు తెలుసు. కాని, సుబ్బులక్షిని ఎందుకు తెచ్చేనంటే, అమ్మా, తల్లీ అనే ప్రయోగంతో ఆయనన్న మాటల్లోని మార్ధవం, ఆర్ధ్రత బాగా వ్యక్తమవుతాయి కదా? "అయ్యరు గారు.." అని మొదలెడితే అంత ఎఫెక్టు ఉండదు కదా?———————-
ఇంక నా రాతలు, కవితలు గురించి ఓ రెండు ముక్కలు - ఎవరికెంతలా నా రాతలు గగన కుసుమాలనిపించినా, ఏదో ప్రయోజనం ఆశించి రాస్తున్నవి కాబట్టి, మీ రేంత తిట్టినా, కొట్టినా, కూడలిలో ఎంత లోపలకి పాతరేసినా, ఆఖరుకి నన్ను వెలివేసినా - నెను మారలేను, నాదారి మార్చుకోలేను, అతుకుల బొంతల దొంతర్లే కవితలంటూ మీముందుంచలేను. కాదు, కాదు, కానే కాదెన్నటికీ నా కల కన్నీరు కాదు, కానివ్వను. రాయటం ఆపేస్తాను కాని, చెత్త మట్టుకు రాయను. అది మీకెవ్వరికీ అర్ధం కాకపోయినా సరే - నా అంగట్లో కుత్రిమమైన కాగితపు పూలు మాత్రం అమ్మలేను. వార్తా పత్రికలో వార్తల్లాంటి నిర్జీవమైన వ్యాసాలు, ఆర్చీస్ గ్రీంటింగ్ కార్డుల వెనక ఉండే కాప్షన్ లాంటి కవితలూ - రాయను గాక రాయను.
[వివరణ]అమృతం కురిసిన రాత్రి చదివిన వాళ్ళకి బహుఃసా తిలక్ తన కవిత్వం గురించి రాసిన వెన్నెల్లో ఆడపిల్ల కవిత - కొద్దిగా స్పురించిందేమో?ఇక్కడ "కూడలిలో ఎంత లోపలకి పాతరేసినా" అనే వాక్యం రాయడానికి నేను చాలా సంకోచించేను. కాని రాయక తప్ప లేదు. ఎందుకు రాసేనంటే, మన సబ్-కాన్షస్ మనతో ఎలాటి ఆటలాడుతుందో సోదాహరణంగా చేప్పడానికి. బ్లాగర్లందరికీ, ‘కూడలి’, ‘పాతరేసిన’ అనే పదాలు చూడగానే, వీవెన్ గారి కూడలే గుర్తొస్తాయి. కాని, అదే ఈ వ్యాసం ఏదో వార పత్రికలో వచ్చిందనుకోండి? అప్పుడు మీకేం గుర్తొస్తుంది? పాత కాలంలో నిజానికి కట్టుబడి, తిరుగుబాటు చేసిన - కవులనీ, శాస్త్రవేత్తలనీ - పదిమందిలో ఉరి తీసేవారు. అది గుర్తుకు వచ్చేది కదా? చూసేరా - మీ నిదురించే తోట మీతో ఎన్ని మాయలు చేస్తుందో?ఈయనేంటి, అమాయకుడైన వీవెన్ ని కూడా వదలటంలేదూ అని మీకు చాల కోపం వస్తుందేమో అని నేను చాలా భయపడ్డాను. కాని, వాడక తప్పలేదు.——————–
చేప్పేను కదా - రామోజీ ఫిల్మ్ సిటీలో ఏరుకోవటంలేదు నా కవితలు. నాకవి ఎక్కడ దొరకుతాయో, ఎందుకు వాటిని రాస్తున్నానో చెప్పాలంటే:
…. గగన కుసుమం కవిత….ఉప సంహారం:
[వివరణ]నిజానికీ కవిత అవసరం ఈ వ్యాసంలో లేదు. ఉపసంహారం కోసం - వాడాల్సి వొచ్చిందంతే. బహుఃసా, ఈ కవితని అంత పట్టుదలగా ఎవరూ చదవలేదేమో. (ఈ కవిత రాసి, ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలైంది, నిన్న రాసింది కాదు. కాని, వెంకట రమణకే అంకితం)ఉప సంహారం అని మాట — నేను ప్రయోగించిన బాణాన్ని వెన్నక్కి తీసుకొంటున్నాను అనే భావం మీలో కలగడం కోసం వాడినది.—————————వెంకట రమణ నాకు మంచి మిత్రుడు, పైగా నా శిష్యుడు - అంటే, ‘కాన్పూ’రులో ఆయన ప్రోజెక్ట్టు ప్రసవ వేదనలు పడుతున్నపుడు మంత్రసాని సాయం చేసేను లెండి, ఆ తర్వాత, పచ్చి బాలింతరాలిగా ఉన్నపుడు - కబుర్ల కాకరకాయల వేపుడు వండిపెట్టేను. అందుకని, నాకు ఆయనతో ఉన్న చనువుని, చట్టరీత్యా సంక్రమించిన పెద్దరికాన్ని పునస్కరించుకిని కొద్దిగా మందలించడానికి, అదిలించడానికి, అవసరమైతే హూంకరించడానికి హక్కు భుక్తాలున్నవాణ్ణి. అందుకని, ఇలా అన్నాను, అంత మాత్రం చేత మిమ్మల్ని అభిప్రాయాలని చెప్పద్దొనటంలేదు. రాయడానికి నాకెంత హక్కుందో, దానిమీద మీకు తోచిన అభిప్రాయం చెప్పే హక్కు మీకు అంతకన్నా ఎక్కువగానే ఉంది అని నాకు తెలుసు, మీ అభిప్రాయం ఏదైనప్పటికీ సంకోచించకుండా చెప్పాలి కూడా. వెంకటరమణ చేసిన వ్యాఖ్య వల్లే కదా ఈ గగన కుసుమం పుట్టింది? అందుకని ఇది ఆయనకే అంకితం. తప్పైనా, ఒప్పైనా మీరనుకొన్నది మీరు నిర్భయంగా చెప్పండి - తప్పులేదు. కవిత్వం రాసే వాళ్ళం కదూ - మాకు భావావేశం ఎక్కువ - మీరు భరించాలి, అది మీకు తప్పదు.
[వివరణ]ఇక్కడనుంచీ అభ్యర్ధన, ప్రార్దన లాంటి భావాలు ప్రవేశపెట్టబడ్డాయి. నన్ను స్త్రీగా చిత్రీకరించుకోడంలో — మీ ఆప్యాయత కొట్టేడానికి ఇదో ఎత్తు. ఇక్కడతో ప్రొఫసర్ గారు మళ్లా పోయట్ అయిపోయేరు పాపం.శాంత రస ప్రయోగం.———————అయితే, ఒక చిన్న మనవి:మీకు నచ్చితే - బాగుంది అన్న ఒక్క వాక్యం సరిపోతుంది, రాసేవాడిని ప్రోత్సహించడానికి. కాని, అర్ధం కాకపోతే, ‘అర్ధం కాలేదు’ అన్న ఒక్క ముక్క చాలదు కదండీ? ఎందుకు అర్ధం కాలేదో, ఎక్కడ అర్ధం కాలేదో, ఏదర్ధం కాలేదో చెపాల్సిన భాద్యత మీమీద లేదా? ఆ భాగ్యానికి కూడా మేం నోచుకోలేదా? మీరు అలా చెప్పక పోతే, సవరించి సంస్కరించే అవకాశం మాకు ఎలా లభిస్తుంది? ఇంత కష్టానికి ఆ పాటి ఫలం కోరడం కూడా అత్యాశేనా?
[వివరణ]మొదటి పేరాలాగే, ప్రశ్నార్ధకాలూ, దీర్ఘాలు .. వక్తిగతం, ప్రతి ఒక్కరినీ ఉద్దేశించటం, కానీ, ఈ సారి ప్రాధేయ పడటం, వినయం, విన్నపం—————————-అర్ధంకాని, అర్ధంలేని రాతలు రాసి మీ నెత్తిన రుద్దటానికి - మీ సమయం ఎంత అమూల్యమైనదో నేనురుగనా?
ఆపైన మీ ఇష్టం - మీరేమిచ్చినా అదే నా ప్రాప్తం. ఇక మీదట, సరళికృతం చెయ్యడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నాలుగో భాగంలో సిరివెన్నెల రాసిన "ప్రాగ్దిశ వీణియ పైనా, దినకర మయూఖ తంత్రులపైనా, జాగృత విహంగ తపులద్వినీల గగనపు వేదికపైనా" పాటతో మొదలుపెట్టి, ఆ కవితని ఆయన విశ్వకార్యమునకిది భాష్యముగా అని ఎందుకన్నాడో, అందులో ఉన్న తాత్విక చింతనని గురించి చెపదాం అనుకొన్నాను - కాని, మీ వాలకం చూస్తే, మా ఇంటికొచ్చి మరీ నన్ను తన్నేటట్టున్నారు - అందుకని, దాన్ని వదిలిపెట్టి, కొన్ని సరళమైన కవితల గురించే చెప్పుకొందాం - ములిగిపోయేదేముందీ?
ఇప్పటికింతే — మీరంతా ఏమంటారో తెలుసుకొని, ఆ తర్వాతే - తమ దర్శనం.
[వివరణ]ఇదంతా మార్కెటింగ్. మిమ్మల్ని తిట్టి, మీచేతే అలక తీర్పించుకొనే ఎత్తు. అయ్యొయ్యో - వద్దండీ, అంత కోపం అయితే ఎలాగండీ, చెప్పడం మానీకండీ.. ప్లీజ్ అని మీ చేత అనిపించడానికేసిన పాచిక. మీ చేత బావురుమనిపించడానికి.పాచిక పారిందా లేదా?అనుమానం ఉంటే, ఈ వ్యాసానికి అందరూ రాసిన వ్యాఖ్యలని ఒక సారి చూడండి. వారి, వారి వ్యక్తిత్వానికి తగ్గట్టుగా, వారిలో కలిగిన ప్రేరణలని అందరూ ఎంత చక్కగా వ్యక్త పరిచేరో? మీకు కవిత్వం అర్ధం కాదా? ఎవరి చెవిలో పెడుతున్నారు పువ్వులు?
——————
నవ రసాలనీ మీకు రుచి చూపించడానికీ ఈ వ్యాసం కేస్-స్టడీ గా రాసేను. వాటిని ఎలా ప్రయోగించాలో సోదాహరణంగా వివరించడానికీ ఈ వ్యాసం. అలాగే, ఇంతకు ముందు వ్యాసంలో రాసిన నిదురించే పాటకి రాసిన విశ్లేషణని మీచేత అనుభవింప చెయ్యడానికి చేసిన ప్రయోగం. ఇపుడు, నిదిరించే తోట అంటే ఏమిటో, రంగవల్లుల్లంటే ఏమిటో, దీపాలంటే ఏమిటో అర్ధం అయ్యిందని ఆశిస్తాను. అర్ధం కాలేదంటే మాత్రం …. కాస్కో, చూస్కో, ఖబఢ్ధార్….
వెంకట రమణ, వీవెన్, రాధికా:మిమ్మల్ని నొప్పించుంటే మనసారా నన్ను క్షమించండి. మిమ్మలడ్డుపెట్టుకొని ఇలా నాటకం ఆడడం తప్పే. కాని సాహిత్య ప్రయోజనం కోసం… అర్ధం చేసుకొంటారని ఆశిస్తున్నాను.తెలుగు బ్లాగర్లందరినీ మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను. ఇలాటి వ్యాసం ఇంకెక్కడైనా రాసుంటే - ఈ పాటికి పెద్ద యుద్దం జరిగి పోయుండేది. ఇంతలా విరుచుకు పడ్డా, మీరంతా చూపిన సంయమనం, మీ మానసిక పరిపక్వతకి, మీ స్నేహ శీలతకీ అద్దం పడుతోంది.
ఇక్కడతో, వాక్యం రసాత్మకం కావ్యం లో మొదటి రెండు అధ్యాయాలూ సమాప్తం. కవిత్వం అర్ధం కావాలంటే మనకి మనం అర్ధం కావాలని చెప్పుకొన్నాం కదా. అంటే ఏమిటో ఈ వ్యాసంలో చెప్పడానికి ప్రయత్నించేను.ఇంక అందం అర్ధం కావడం అంటే ఏమిటో, ముడో అధ్యాయంలో:సౌందర్య శాస్త్రం (ఈస్తెటిక్స్) ని పరిచయం చేసి, ఆ తరువాత సిరివెన్నెలలో విహారాలు చేద్దాం, ఓ పది రోజుల విరామం తరువాత.నన్ను ప్రొఫెసర్ అన్నారు కాబట్టి, సీరియస్ గా చదువుతున్న వారందరికీ ఈ పది రోజులకీ సరిపడా హోమ్-వర్క్:౧. మీ రందరూ రచయితలూ, కవులే కాబట్టి (అమ్మలూ, పుల్లింగం వాడినందుకు మిమ్మలని విడిచిపెట్టేననుకోవద్దు) - మీ రచనలలో కాని, మీకు నచ్చిన బ్లాగులల్లొ కాని, మీకు నచ్చిన కవితలో కాని - ఉన్న రసాలన్ని ఐడెంటిఫై చెయ్యండి.౨. మీరు పాఠకులలో కలగ చేద్దామనుకొన్న రసాన్ని, ఆవిష్కరించటానికి మీరుపయోగించిన, లేక మీ అభిమాన రచయిత ఉపయోగించిన పద్దతులేంటో విశ్లేషించండి. దానికి మీరు మెరుగులేమైనా దిద్దగలరా?౩. ఈ వ్యాసంలో నవరసాలూ ఉన్నాయి, సుమారుగా. వాటన్నిటినీ నేను మీకు పూర్తిగా చెప్పలేదు. ఎక్కడ ఏ రసం ఉందో కని పెట్టగలరా?౩. మీరు రాస్తున్న కవితలకీ, వ్యాసాలకీ - టాగ్ గా - నవరసాల పేర్లనీ ఉపయోగించ గలరా? అంటే, మీ రచనలో ఉన్న రసం పేరు మీకు తెలుసా?౪. నవ రసాల పేర్లు: శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, భీబత్సం, అద్భుతం, శాంతం. వీటికున్న స్తాయీ భేదాలని బట్టీ వీటిని, రతి, హాస, శోక, క్రోధ, ఉత్సాహ, భయ, విశ్మయ, శాంత రసాలని కూడా అంటారు. వేరే పేర్లు కూడా ఉండొచ్చు.౫. చివరగా, నేను ఉద్దేశించిన రస నిర్ధేశం ఉందోలేదో - అంటే, అటువంటి భావాలు మీలో కలిగేయో లేదో నాకు చెప్పాలి మరి.

1 comment:

Bolloju Baba said...

దార్లగారికి ధన్యవాదములు
ఈ వ్యాసాలు చాలా బాగుంటాయండీ. నేను బ్లాగ్ప్రపంచంలోకి వచ్చిన కొత్తలో చదివాను. ఆ తరువాత ఒకటి రెండుసార్లు ప్రయత్నించినా వారిబ్లాగు తెరచుకోలేదు.
మీరిలా పెట్టటం ఆనందంగా ఉంది.
నాగరాజు గారు బ్లాగు మూసివేయటం పట్ల నాకోపం అలానే ఉంది :-)
very well written scholarly articles kadaMdi.