Friday, October 20, 2006

స్థానిక గొంతులే...?

ఆర్పవలసింది ముందు బ్లో అవుట్స్ నికాదు
అవన్నీ తాత్కాలికమే
తరలిపోతున్న సంపద కాలిబూడిదవుతున్న ప్రాంతం

ఆమట్టిలో పుట్టినోళ్ళలో మట్టి
దోబూచులాటల్లో మోసం
తప్పనిసరై రగులుతున్న గుండెమంటలు
ఈ మంటలార్పండి ముందు
రాయలసీమ...తెలంగాణ...కోనసీమ...ప్రాతాలుగా విడిపోతేనేమి
అస్తిత్వ పోరాట ధ్వనుల్లో స్థానిక గొంతుల్ని వినండి
రియల్ ఎస్టేట్స్... ఇండస్ట్రియలిస్ట్స్...బ్యూరోక్రాట్స్...
పేర్లేవైతేనేమి దోపిడీల నయావలసవాదమే!

ఫ్యాక్షనిజం, క్యాస్ట్ పాలిటిక్స్, ఆక్వాకల్ట్చర్...అంతా పొల్యూషనే!
పూరిగుడిసలన్నీ తవ్వోడలకే బలి!
అంతర్జాతీయ రింగ్ టోన్స్ ఆకాశ హార్మ్యాల్లో "గూడు " పుఠానీలు
ప్రతీ ప్రాంతమిప్పుడు డ్బ్ల్యు.టి.వొ. ముగ్గులతో కళకళలే!
ఒక్క ప్రాంతమైనా చూడగలరా
ఇవిగో నమ్ముకున్న నేలతల్లికి పెట్టిన రంద్రాలు
చమురన్వేషణలో పచ్చదనాల్లోని విధ్వంసాలు!
కుప్పకూలిన చెట్టంత అనుబంధాలు
పైసా పైసా కూడబెట్టుకున్న అరెకరం కొండచిలువలు మింగేసిన రొయ్యల చెరువు
చూపలేనివి ఇంకా ఎన్నేన్నో!
పేదరాసి పెద్దమ్మ పరిగ గింజల్ని కలబెట్టుకోవటానికే కరువైన కట్టెలు
వాన్ని తగలబెట్టటానికి ఎలావస్తాయ్
గ్యాసిక్కడె పుడుతున్నా దాన్ని ఇందనంగా మార్చుకోలేని అశక్తత!
ఒంట్లో, ఇంట్లో,కంట్లో అన్నింట్లో ఏవేవో ప్రలోభాలు!
కోనసీమిప్పుడు డబ్బుకట్టల్ని ప్రపంచబ్యాంకుకి మోసే రోజువారీ కూలీ!

కోనసీమిప్పుడు బ్లో అవుట్స్ రూపంలో రక్తం కక్కుతున్న కలర్ టి.వి.
కోనసీమిప్పుడు ఓ దారుణ ప్రియదర్శనం!
( ఈ కవితను సెంట్రల్ యూనివర్సిటి లో సెంటర్ ఫర్ కంపేరటివ్ లిటరేచర్ లో లెక్చరర్ గా పనిచేస్తున్న డా.భీమయ్య గారు ఇంగ్లిష్ లోకి అనువాదం చేశారు. దాన్ని ఈ బ్లాగు లోనే చూడవచ్చు)

No comments: