Friday, October 20, 2006

నగరపురస్కారం!

నగరం నన్ను అక్కున చేర్చుకుంటుందనుకున్నాను
పగలనక,రాత్రనక
ఆకలనక,దప్పికనక
నీరసమనక,నిద్రనక
నగరనిర్మాణంలోనే కలిసిపోయింది నాజీవితం!
తాజ్ మహల్ నిర్మాణంలో కూలీలెవరైనా
పవిత్రప్రేమకు పునాదులయ్యో
వెన్నెల చల్లదనంలో శ్రమను మరిపించే కుడ్యాలయ్యో
మహాకవి కవిత్వమయ్యో నిలవగలిగారు!
నగరనిర్మాణాన్ని మురిపెంతో చూడాలని రోడ్డుమీదకొస్తే
నడివీధి 'నడకాలో నెరజాణత్వపు మెలికలు లేవని
కాళ్ళు విరగదీసి నగరం నన్నో వికలాంగుణ్ణి చేసింది
నగరం ఒక పువ్వయ్యింది
నాముక్కికి తాళం పడ్డది
నగరం ఒక ఫలమయ్యింది
నానోరు కట్టివేయబడింది
నగరం ఒక ఇంద్రభవనమయ్యింది
ఓ శాపమేదో నాఅస్తిత్త్వన్ని భస్మం చేసింది!
నగరం నన్ను అక్కున చేర్చుకుంటుందనుకున్నాను
నగరం నాఇల్లనుకున్నాను
నగరం నాకుటుంబమనుకున్నాను
నగరమే నేను-నేనే నగరమనుకున్నాను
నగరనిర్మాణంలోనే అణువునైపోయాను
నగరం నన్ను తిరస్కరించింది
నన్ను తిరస్కరించిన నగరం పురస్కారానికి ఎంపికయ్యింది.
నగరమిప్పుడు రసాన్ని పీల్చేసి
చొప్పను కాల్చేసే అవకాశవాద మానవ స్వభావం!
(ఈ కవిత 'కవితామాలిక-2005' పుట:144లో ప్రచురితమయ్యిది. దీన్ని డా. మురళీ మనోహర్,సెంట్రల్ యూనివర్సిటీ ఇంగ్లీష్ లెక్షరర్ అనువదించారు. దాన్ని ఈ బ్లాగు లోనే చూడవచ్చు!)

No comments:

భారత గొప్పతనం

జనగణమన ...జాతీయగీతం