తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం,హైదరాబాదు లో నా వివరాలు. నా బోధనావివరాలు,నేను బోధించే సిలబస్ , నా విద్యార్థుల వివరాలు తదితర విషయాలు ప్రతిబింబించే వేదిక.
Friday, October 27, 2006
Bikhare bimb Play in HCU
నిన్న రాత్రి(27-10-2006) University of Hyderabad(Central University)లో ప్రముఖ నటుడు,దర్శకుడు Shri Girish Karnad & Shri K M chaitanya ల దర్శకత్వంలో బిఖరే బింబ్ (Broken Images) అనే హిందీ నాటకాన్ని ప్రదర్శించారు. నాటకం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వినియోగించుకున్నారు.ఈ నాటకం లో అరుంధతీ నాగ్ నటన ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసింది. ఒకే పాత్రతో సుమారు గంటా పదిహేను నిమషాలు ప్రేక్షకులను కదలకుండా, రెప్పవాల్చకుండా, ప్రతి మాటనూ ఎంతో ఆసక్తిగా వినే ఉత్సుకతను కలిగించటం సామాన్య విషయం కాదు.నాటకం ఒక టి.వి. స్టుడియో లో జరుగుతుంది.దీనికి రంగస్థల అలంకరణ సహజత్వం ఉట్టిపడేలా ఉంది.ఒక ప్రసిద్ద రచయిత్రి టి.వి.లో ప్రసంగాన్ని ఇవ్వటానికి రావటం తో నాటకం ప్రారంభమవుతుంది. " అంతా బాగానే ఉంది.మైక్ టెస్ట్ చేసుకోనా... కెమేరా ఎక్కడుంది... నేను సిద్దం..." అంటూ చేతిలో తాను ప్రసంగం ఇవ్వవలసిన విషయాల్లోని ముఖ్యవిషయాలు ఉన్న కాగితం పట్టుకోవటం వంటివన్నీ ఇంకా నాటకం ప్రారంభం కాలేదు. దానికోసం తయారవుతున్నారేమో అనే ఫీలింగ్ ని కలిగిస్తూనే నాటకం లో ప్రేక్షకులు లీనమైపోయేటట్లు చేయగలిగారు. ఇక్కడే ఉంది అసలైన దర్శకుల ప్రతిభ! యూనివర్సిటీ లలో ప్రదర్శించవలసిన ఇతివృత్తమే నాటకం లో ఉంది.దీనిలో వస్తువు మేధో చౌర్యం. రంగస్థలం మీద ఒకే పాత్ర కనిపిస్తుంది. కాని మూడు పాత్రల మధ్య జరిగిన కథను 'ఆత్మ సంఘర్షణ ద్వారా ప్రదర్శించటం' అనే మంచి టెక్నిక్ ని ఎన్నుకున్నారు. రచయిత్రి అనర్ఘళంగా, జీవితానుభవాలను వివరించటం తో టి.వి. ప్రసంగం అయిపోతుంది.నిజానికి నాటకం ఇక్కడినుండే ప్రారంభం అయ్యింది! ఆ రచయిత్రి ప్రసంగం అయిపోయిందని హాయిగా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. తనకి పెట్టిన మైక్రోఫోన్ తీసేస్తుంటుంది.కెమేరా ఆపేసారు. కానీ, టి.వి.లో తన ప్రతిబింబం(ఆత్మ)మాట్లాడటం ప్రారంభిస్తుంది. ఒక్కసారిగా ఆ రచయిత్రి ఇంకా కెమేరా ఆపలేదా అంటూ గాబరా పడిపోతుంది. స్విచ్ ఆఫ్ చేయాలనీ ప్రయత్నిస్తుంది. కానీ ఆగదు.ఆ పాత్ర మాట్లాడుతునే ఉంటుంది. ప్రేక్షకుల్లో కూడా ఒక్కసారిగా విస్మయం! ఇక్కడ టెక్నికల్ గానూ చాలా జాగ్రత్తలు తీసుక్కున్నారు.ఒకవైపు టి.వి.లో బొమ్మ (ఆత్మ) మాట్లాడటం, దానికి రచయిత్రి సమాధానాలు చెప్పటం రసభరితంగా సాగింది. టి.వి.లోని ప్రతిబింబం అనేక ప్రశ్నలు వేస్తుంది.చాలావాటికి రచయిత తెలివిగా సమాధానాలు చెపుతుంది. కానీ కొన్ని ప్రశ్నలు తన నిజాయితీని నిలువెత్తునా చీరేస్తాయి.సమాధానం చెప్పలేని పరిస్థితి.ఇలా రచయిత్రి టి.వి. వైపు చూస్తూ సమాధానాలు చెప్పటం, కొన్ని సార్లు కోపంతో ఊగిపోవటం, మరికొన్ని సార్లు హాస్యంతో పులకరించటం ...అనేక మనస్తత్వాలను అరుంధతీనాగ్ రక్తి కట్టించ గలిగారు. టి.వి.లోని ప్రతిబింబం కూడా ఆ రచయిత్రి ఎటు నడిస్తే అటుగా చూడటం,ఆమె ఉద్వేగానికి తగినట్లు ముఖ కవళికలు ప్రదర్శించటం వంటివి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయగలిగింది. ఇక్కడే సాంకేతికత, నటి సమయోచిత నటనా కౌశలం,దర్శకుల ప్రతిభ అపూర్వంగా కనిపిస్తుంది. నాటకం సుమారు ఒక గంటా పదిహేను నిమషాలు సాగినా ఎక్కడా విసుగు రాలేదు. నాటకం పూర్తైన తర్వాత రచయిత్రి పాత్ర వేసిన అరుంధతీ నాగ్ కి ప్రేక్షకులంతా అత్యంత గౌరవంగా నిలబడి కరతాళ ధ్వనులు చేశారు. Sarojini Naidu School of Perfoming Arts, Fine Arts & Communication, University of Hyderabad వారు అభినందనీయులు!
vrdarla@yahoo.com
darlash@uohyd.ernet.in
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment